హైకోర్టు జడ్జి ట్రాన్స్​ఫర్​పై లాయర్ల నిరసన

హైకోర్టు జడ్జి ట్రాన్స్​ఫర్​పై లాయర్ల నిరసన

హైదరాబాద్, వెలుగు : హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్​ అభిషేక్​రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులు చేసినట్లు వార్తలు వెలువడిన క్రమంలో ట్రాన్స్​ఫర్​ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు బార్‌‌ అసోసియేషన్‌‌ గురువారం నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డి బదిలీని నిలిపివేయాలని డిమాండ్‌‌ చేసింది. అసోసియేషన్‌‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సర్వసభ్య సమావేశం జరిగింది. తర్వాత కోర్టులకు వెళ్లి విధులు బహిష్కరించాలని లాయర్లను కోరారు. ఎంపిక చేసిన ఒకరిద్దరు జడ్జీలను మాత్రమే బదిలీ చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ ట్రాన్స్​ఫర్​ న్యాయ వ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. విధుల బహిష్కరణ కొనసాగిస్తామని జిల్లా మున్సిఫ్‌‌ కోర్టుల బార్‌‌ అసోసియేషన్‌‌లు కూడా ప్రకటించాయి.

హైకోర్టు గేటు వద్ద హైకోర్టు బార్‌‌ అసోసియేషన్‌‌ ప్రతినిధులు, లాయర్లు నిరసన తెలిపారు. జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌ రెడ్డి సీనియార్టీ ప్రకారం తెలంగాణ హైకోర్టులో (సీజే కాకుండా) ఐదో స్థానంలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన, వాషింగ్టన్‌‌ డీసీలో ఎల్‌‌ఎల్‌‌ఎం పూర్తిగా చేశారు. 1990లో లాయర్​గా ఎన్‌‌రోల్‌‌ అయ్యారు. 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.