గొర్లు ఇస్తమని  గోసవెడ్తున్నరు

గొర్లు ఇస్తమని  గోసవెడ్తున్నరు
  • 5 రోజుల కింద పక్క రాష్ట్రాలకు వెళ్లి గొల్లకురుమల అవస్థలు 
  • పట్టుకెళ్లిన పైసలైపోయి తిండికి కూడా తిప్పలు
  • సర్కారిచ్చే పైసలకు ఎక్కడా 21 గొర్లు రావట్లేదని మండిపాటు
  • తమ వాళ్లను తీసుకురావాలంటూ కుటుంబీకుల ధర్నా 
  • హుజూరాబాద్‌‌లో రెండో విడత గొర్ల పంపిణీ ప్రారంభం 
  • మేము రామంటూ గొల్ల కురుమల నిరసన

జమ్మికుంట, వెలుగు: గొర్ల పంపిణీ పేరుతో సర్కారు గొల్లకురుమల గోస పుచ్చుకుంటోంది. గొర్లు తెచ్చుకోవాలని పక్క రాష్ట్రాలకు పంపిన లబ్ధిదారులను గాలికొదిలేసింది. దీంతో వెంట తీసుకెళ్లిన పైసలు అయిపోయి తిండికి కూడా తిప్పలు పడుతున్నారు. ఐదు రోజులుగా తిరుగుతున్నా గొర్లు దొరకట్లేదని ఊర్లోని కుటుంబీకులకు ఫోన్‌‌ చేసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. గొల్ల కురుమలను బాగు చేయడానికి స్కీమ్‌‌ను తెచ్చినట్లు లేదని, దళారుల కోసం తీసుకొచ్చినట్టుందని మండిపడుతున్నారు. తమ వాళ్లు ఇబ్బంది పడుతుంటే గొర్ల పంపిణీ పేరుతో సంబురాలు చేస్తరా అంటూ బుధవారం జమ్మికుంటలో రెండో విడత గొర్ల పంపిణీ కోసం జరిగే మీటింగ్‌‌కు సర్కారు పంపిన బస్సులను లబ్ధిదారుల కుటుంబీకులు అడ్డుకొని నిరసన తెలిపారు. 

జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన 70 మంది యాదవులకు ప్రభుత్వం గొర్రెల యూనిట్లు మంజూరు చేసింది. రూల్స్‌‌‌‌ ప్రకారం లోకల్‌‌‌‌గా ఉండే వెటర్నరీ ఆఫీసర్‌‌‌‌తో వెళ్లి తమకు నచ్చిన గొర్రెలను గొల్లకురుమలే తెచ్చుకోవాలి. ఆఫీసర్ల సూచన మేరకు 30 మందితో ఓ బ్యాచ్ ప్రత్యేక వెహికల్​తీసుకొని 5 రోజుల క్రితం బయలుదేరింది. ముందు కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతాల్లో తిరిగింది. సరైన గొర్రెలు దొరకలేదు. దీంతో ఆఫీసర్లకు విషయం చెప్పగా అటు నుంచి అటే సోమవారం ఏపీలోని కడప జిల్లాకు పంపారు. అక్కడా ఇదే పరిస్థితి ఎదురైందని లబ్ధిదారులు చెప్పారు. 
మాకసలు గొర్లే వద్దు
సర్కారు ఇచ్చే పైసలకు ఎక్కడా 21 గొర్రెలు రావట్లేదని ఆఫీసర్లు, తమ కుటుంబీకులకు చెప్పి గొల్ల కురుమలు వాపోయారు. పైసలు అయిపోయి తిండికి కూడా తిప్పలు పడుతున్నామని కుటుంబీకులకు వీడియో తీసి పంపి తమ గోడు చెప్పుకున్నారు. గొర్లు కావాలని తామేం అడగలేదని.. ఆఫీసర్లే ఇస్తామని చెప్పి ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తమకు ఎలాంటి సబ్సిడీ గొర్రెలు వద్దని అన్నారు. ఈ క్రమంలో బుధవారం జమ్మికుంటలో మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ఆధ్వర్యంలో చేపట్టిన గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవానికి తీసుకెళ్లేందుకు మడిపల్లెకి బస్సులు వెళ్లగా బాధిత కుటుంబీకులు వాటిని అడ్డుకొని నిరసన తెలిపారు. 5 రోజులుగా తమ వాళ్లు ఇంటికి రాకుండా గొర్రెల కోసం అష్టకష్టాలు పడుతుంటే అధికారులు సంబురాలెలా చేస్తారని నిలదీశారు. తాము కార్యక్రమానికి రామని తేల్చి చెప్పారు. తమ వాళ్లను వెంటనే రప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ 
చేశారు. 
పంచకముందే 5 గొర్లు మృతి 
జమ్మికుంటలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి తీసుకొచ్చిన గొర్లలో పంచకముందే 5 గొర్రెలు మృతి చెందాయి. మంగళవారం రాత్రి తీసుకొచ్చిన గొర్లలో 5 మృతి చెందగా వాటిని జమ్మికుంట కొత్త వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వెనుక పడేశారు. స్కీమ్‌‌‌‌ల పేరు చెప్పి కుంటి, గుడ్డి, రోగపు గొర్లను తమకు అంటగడుతున్నారని గొర్లకురుమలు ఫైర్ అయ్యారు.
5 రోజుల సంది తిరుగుతనే ఉన్నం
గొర్లు కొనడానికి 30 మందిమి ఆదివారం బీదర్‌‌‌‌కు వెళ్లినం. అక్కడి బ్రోకర్ అక్కడ ఇక్కడ తిప్పిండు. గొర్ల కాపర్లు మారతున్నరు గాని గొర్లు మారట్లేదు. అక్కడ ఉన్నవే 200 గొర్రెలు. కానీ మాకు 800కు పైనే కావాలి. ఆ గొర్లు కూడా బాగా లేకపోవడంతో వద్దని చెప్పినం. పోయిన ఒక్క రోజే మాకు భోజనం పెట్టిన్రు. మూడ్రోజులు అడవిలనే తిరిగినం. అధికారులకు ఫోన్ చేస్తే ఇంటికి రాకండి.. కడప, అనంతనపురం పోతే దొరుకుతయని చెప్పిన్రు. దాంతో కడప జిల్లా పోరుమామిళ్లకు వచ్చినం. ఈడ కూడా ఎవరు పట్టించుకుంటలే. అందుకే వీడియో తీసి పంపినం. మా ట్రాన్స్‌‌‌‌పోర్టు ఖర్చులే రూ. 45 వేలయినయ్‌‌‌‌. గొర్లు ఇస్తామని.. మమ్మల్ని గోస పుచ్చుకుంటున్నరు.                                      - బండి వినయ్, మడిపెల్లి, జమ్మికుంట మండలం, కరీంనగర్