ఎవరికీ అంతుచిక్కని కాంగ్రెస్​ కంచుకోట

ఎవరికీ అంతుచిక్కని  కాంగ్రెస్​ కంచుకోట
  •     ఈసారి టికెట్​ రేసులో వారసులు, యువనేతలు
  •     ఇప్పటి వరకు బోణీ కొట్టని బీఆర్ఎస్
  •     బీజేపీలో ‘అయోధ్య’ జోష్​

నల్గొండ, వెలుగు : కాంగ్రెస్​ కంచుకోటగా భావించే నల్గొండ పార్లమెంట్​స్థానం ఇతర పార్టీలకు అంతుచిక్కడం లేదు.  రాష్ట్రమంతా బీఆర్ఎస్​ గాలి వీచిన 2014, 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ  కాంగ్రెస్​ జెండానే ఎగిరింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్లమెంట్​పరిధిలోని 7 నియోజకవర్గాలకు ఆరు స్థానాల్లో కాంగ్రెస్​ విజయభేరి మోగించింది. దీనికితోడు ఎన్నికల తర్వాత పెద్దసంఖ్యలో బీఆర్ఎస్​ క్యాడర్ ​హస్తం గూటికి చేరింది.  దీంతో మరోసారి నల్గొండ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్​ ధీమాతో ఉండగా, ఎలాగైనా ఇక్కడ  గెలవాలని బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. మరోవైపు క్యాడర్​లేని బీజేపీ నుంచి సైతం ‘అయోధ్య జోష్​’తో పోటీకి పెద్దసంఖ్యలో లీడరర్లు ముందుకు వస్తున్న తీరు ఆసక్తి రేపుతోంది.

 బీఆర్ఎస్​ హవాలోనూ కాంగ్రెస్​దే విజయం..

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రమంతా బీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ  నల్గొండ పార్లమెంట్ పరిధిలోని​ఓటర్లు మాత్రం కాంగ్రెస్​ వెన్నంటి నిలిచారు. ఇక్కడ గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్​ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఏడు సెగ్మెంట్ల పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ 2019 ఎంపీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్​ నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విజయం సాధించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింట ఆరు చోట్ల కాంగ్రెస్​ అభ్యర్థులు బంపర్​ మెజార్టీతో గెలుపొందగా.. ఒక్క సూర్యాపేటలో మాత్రమే స్వల్ప తేడాతో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక బీజేపీకి ఎక్కడా డిపాజిట్​ కూడా దక్కలేదు. సూర్యాపేటలో మాత్రమే 40 వేల ఓట్లు పోలయ్యాయి. 

కాంగ్రెస్​లో తెరపైకి వారసులు.. 

నల్గొండలో కాంగ్రెస్ ​టికెట్​ వస్తే చాలు ఎంపీ అయిపోవచ్చనే అంచనాలుండడంతో టికెట్ ​కోసం పోటీ పెరిగిపోతోంది. ఈసారి ప్రముఖ రాజకీయ నాయకులంతా వారసులతో రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్​ నేత కుందూరు జానారెడ్డి కొడుకు రఘువీర్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సూర్యాపేట సీనియర్​ నేత పటేల్​ రమేశ్​ రెడ్డికి ఎంపీ టికెట్​ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలముందు  స్వయంగా హైకమాండ్​ పెద్దలే  ఇంటికి వచ్చి లిఖిత పూర్వక హామీ ఇచ్చారు.

 పైగా రఘువీర్​ రెడ్డి, పటేల్​ రమేశ్​రెడ్డి ఇద్దరికీ సీఎం రేవంత్​ రెడ్డి సన్నిహితులనే ముద్ర ఉంది.  వీళ్లతో పాటు ఇదే జాబితాలో జానారెడ్డి ప్రధాన అనుచరుడు డీసీసీ ప్రెసిడెంట్​ శంకర్​ నాయక్​, మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు, నల్గొండ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్​ రెడ్డి పార్టీ అవకాశం కల్పిస్తే ఎంపీగా పోటీ చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ ఎస్టీ క్యాండిడేట్​ను రంగంలోకి దించితే శంకర్​ నాయక్​ తనకు ఛాన్స్​ వస్తుందనే ఆశతో ఉన్నారు. ఈ సెగ్మెంట్​లో ఎస్టీ, ఎస్సీ, ముస్లిం మైనార్టీ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉండడం కాంగ్రెస్​కు కలిసివస్తోంది. పైగా ఇద్దరు మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి ఇదే ఎంపీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం, జానారెడ్డి లాంటి ఉద్దండుల అండ కాంగ్రెస్​ కు అదనపు బలం.

బీఆర్​ఎస్​ బోణీ కొట్టేనా?

నల్గొండ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్​ భగీరథ ప్రయత్నాలే చేస్తోంది. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ వచ్చాక జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​ ఇక్కడ ఖాతా తెరవలేదు. 2014లో పల్లా రాజశ్వేర్​ రెడ్డితో, 2019 లో వేమిరెడ్డి నర్సింహారెడ్డితో పోటీ చేయించినా ఫలితం దక్కలేదు. 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ సత్తా చాటినా, ఎంపీ  ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. గత ఎంపీ ఎన్నికల్లో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ స్వయంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై నడపడంలో ఫెయిల్​ అయ్యారు. అసెంబ్లీ ఎలక్షన్స్​ తర్వాత ఇప్పుడు క్యాడర్​ చేజారుతుండడంతో బేజారవుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవల నల్గొండలో కేసీఆర్ పెట్టిన 'ఛలో నల్గొండ' సభ అనుకున్నంత సక్సెస్​ కాకపోవడం ఆ పార్టీ నేతలను కలవరపెడ్తోంది. పదేండ్లలో జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తిచేయకపోవడం బీఆర్ఎస్​కు మైనస్ ​కానుంది.  దీంతో ఆ పార్టీ  నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి ఉంది.  మాజీ ఎంపీ, ప్రస్తుత మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి తన కొడుకు అమిత్​ రెడ్డిని నల్గొండ నుంచే బరిలో నిలపాలని భావించారు. కానీ, ఏడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేశాక మనసు మార్చుకొని భువనగిరి ఎంపీ సీటుపై కన్నేసినట్లు సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున నల్గొండ ఎంపీగా పోటీ చేసిన ఆయన  కాంగ్రెస్​ చేతిలో ఓడిపోవడం గమనార్హం.

బీజేపీ నేతల్లో ‘అయోధ్య’ జోష్​.. 

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాక బీజేపీ నేతల్లో జోష్​ పెరిగింది. ఎంపీ టికెట్​ ఆశిస్తున్న వాళ్లంతా ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున కాషాయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో అయోధ్య ఎఫెక్ట్​ కచ్చితంగా ఉంటుందని, గెలుపోటములతో ప్రమేయం లేకుండా తమ ఉనికిని చాటుకుం టామని పార్టీ నేతలు చెప్తున్నారు.  సీనియర్లకు దీటుగా ఇటీవల పార్టీలో చేరిన వాళ్లు సైతం ఎంపీ టికెట్​ కోసం పోటీపడ్తున్నారు.  పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ప్రముఖ న్యాయవాది నూకల నర్సింహారెడ్డి, పార్ల మెంట్​ ఇన్​చార్జి బండారు ప్రసాద్​, జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ నాగం వర్షిత్​ రెడ్డి, పెరిక సురేష్​ లాంటి నేతలు టికెట్​రేసులో  ముందువరుసలో ఉన్నారు. యాదవ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉండటంతో ఆ సామాజిక వర్గం నుంచి మన్నెం రంజిత కుమార్​, మొన్నటి ఎన్నికల్లో ఫార్వర్డ్​ బ్లాక్​ నుంచి పోటీ చేసిన పిల్లి రామరాజు యాదవ్ ఎంపీ టికెట్​ కోసం హైకమాండ్​ను కలవడం ఆసక్తిరేపుతోంది.