- అనుమతి లేని మార్గంలో వెళ్తోందంటూ ఆ నౌకపై ఇరాన్ కాల్పులు
- ఆ వెంటనే హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
- ఇరాన్‌లోని140 టార్గెట్లపై అమెరికా భీకర దాడులు
- బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఖతార్‌పై విరుచుకుపడిన ఇరాన్
- షిప్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం మళ్లీ భీకరంగా దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ముందుగా హార్మూజ్ జలసంధిలో అనుమతి లేని మార్గంలో వెళ్తోందంటూ భారతీయ సిబ్బంది ఉన్న ఓ నౌకపై ఇరాన్ కాల్పులు జరపడం, ఆ వెంటనే జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది.
ఇరాన్‌లోని140 టార్గెట్‌లపై తెల్లవారుజామున క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. సైప్రస్ జెండాతో, 11 మంది భారతీయ సిబ్బందితో వెళ్తున్న కంటైనర్ షిప్‌పై ఇరాన్ కాల్పులు జరిపిన ఘటనలో ఓ భారతీయుడు గల్లంతు కాగా, మిగతా 10 మందిని రెస్క్యూ టీమ్‌లు కాపాడాయి. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కాగా, తమ హెచ్చరికలను, మార్గాన్ని సరిచేసుకుని అనుమతించిన మార్గంలో వెళ్లాలనే సూచనలను పలు నౌకలు తిరస్కరించాయని ఇరాన్ ఐఆర్జీసీ(ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్) తెలిపింది. వాటిలో ఒక నౌకపై హెచ్చరికగా కాల్పులు జరిపి, దానిని నిలిపివేశామని పేర్కొంది. ‘‘ఈ ఘటన తర్వాత.. తదుపరి నోటీసు ఇచ్చే వరకు, ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ముగిసే వరకు హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నాం. ఏ నౌకనూ జలసంధి దాటడానికి అనుమతించబోం’’ అని ఐఆర్జీసీ ప్రకటించింది. ప్రతీకార చర్యలు చేపడితే ధీటుగా జవాబిస్తామని హెచ్చరించింది.
ఇరాన్‌లోని 140 టార్గెట్లపై అమెరికా దాడులు
ఐఆర్జీసీ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే, ఇరాన్‌పై అమెరికా దాడులను ప్రారంభించింది. జలసంధి గుండా వెళ్తున్న సైప్రస్ జెండాతో ఉన్న ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ బహిరంగంగా దాడి చేసిందని అమెరికా పేర్కొంది. ఆ నౌకలోని ఒక పౌర సిబ్బంది అపహరణకు గురయ్యారని, నౌకలో మంటలు చెలరేగడం, ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఆ నౌక ముందుకు సాగలేకపోతోందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడించింది. ‘‘వాణిజ్య నౌకలపై అంతకుముందు జరిగిన దాడులకు బాధ్యులను చేసిన తర్వాత, అవగాహనా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకోవడానికి ఇరాన్‌కు మరో అవకాశం ఇచ్చాం. కానీ అది మళ్లీ విఫలమైంది. దీనికి ప్రతిస్పందనగా, జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని నిరంతరం దెబ్బతీస్తూ అమెరికా దానికి భారీ మూల్యాన్ని విధిస్తోంది” అని పేర్కొంది.
హార్మూజ్ మూసివేతపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ స్పందిస్తూ.. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందన్నారు. కాగా, నాలుగు గంటలపాటు ఇరాన్ క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ స్థావరాలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, సమాచార నెట్‌వర్క్‌లు, తీరప్రాంత నిఘా ప్రాంతాల వంటి దాదాపు 140 లక్ష్యాలపై దాడులు పూర్తయ్యాయని సెంట్‌కామ్ తెలిపింది. జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని ఈ దాడులు దెబ్బతీస్తాయని పేర్కొంది. కాగా, ఇంధన, పెట్రోకెమికల్ కేంద్రాలైన బుషెహర్, అసలుయెహ్‌లతో సహా దేశంలోని దక్షిణ తీరాల వెంబడి పలు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. బందర్ అబ్బాస్, బందర్-ఇ దయ్యర్ రేవు నగరాలు, హార్మూజ్ జలసంధికి సమీపంలోని సిరిక్ ప్రాంతంలో కూడా పేలుళ్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్స్
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఆదివారం గల్ఫ్ దేశాల్లోని యూఎస్ స్థావరాలపై విరుచుకుపడింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులతో బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ దేశాల్లో హెచ్చరికల సైరన్‌లు మోగాయి. ఆయా దేశాల్లో అనేక చోట్ల పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌లు, క్షిపణులను అడ్డుకుంటున్నందున ఈ పేలుళ్లు జరుగుతున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయా దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. కాగా, గత నెలలో ఇరాన్, అమెరికా మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా, ఇటీవల మళ్లీ పరస్పర దాడులు మొదలవడంతో ఈ ఒప్పందానికి తూట్లు పడ్డాయి. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే, హార్మూజ్‌ను ప్రపంచ దేశాల నౌకల రాకపోకలకు ఓపెన్‌గా ఉంచాలని అమెరికా స్పష్టం చేస్తుండగా.. ఆ జలసంధి తమ కంట్రోల్లోనే ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది.
షిప్‌పై దాడిని ఖండించిన భారత్
ఒమన్ తీరానికి సమీపంలో, హార్మూజ్ జలసంధిలో ఆదివారం తెల్లవారుజామున సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జీఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే కంటైనర్ షిప్‌పై ఇరాన్ కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షిప్ ఇంజన్ రూమ్ పూర్తిగా కాలిపోవడంతో నౌక ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో ఒకరు గల్లంతయ్యారు. మిగతా పది మందిని రెస్క్యూ టీమ్‌లు కాపాడాయని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. జీఎఫ్ఎస్ గెలాక్సీ వాణిజ్య నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులను భారత్ తీవ్ర ఆందోళనకరమైనవిగా అభివర్ణించింది. పశ్చిమాసియాలో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోకూడదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాల గుండా ఉచిత, అడ్డంకులులేని నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది.
