ఎంఎస్ఎంఈలకు బొనాంజా..అమెరికా ట్రేడ్ డీల్తో చిన్న కంపెనీలకు భారీ మార్కెట్ 

ఎంఎస్ఎంఈలకు బొనాంజా..అమెరికా ట్రేడ్ డీల్తో చిన్న కంపెనీలకు భారీ మార్కెట్ 
  • చాలా ఉత్పత్తులపై సుంకాలు సున్నా
  • యూఎస్​తో మరింత ఈజీగా వ్యాపారం
  • చైనాతో పోటీ పడటం సులువు

న్యూఢిల్లీ:భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వ్యాపారం భారీగా పెరగనుంది. సుంకాల తగ్గింపు, మార్కెట్ సదుపాయాలు, నిబంధనల సడలింపులు చాలా  రంగాలకు నేరుగా మేలు చేస్తాయి. భారత వస్తువులపై యూఎస్ సుంకాలు గతంలో ఉన్న 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. 

కొన్ని ఉత్పత్తులపై  సుంకాలు పూర్తిగా తొలగిపోవడంతో  భారత కంపెనీలకు, ముఖ్యంగా స్మాల్​, మీడియం ఇండస్ట్రీలకు (ఎంఎస్ఎంఈలకు)  భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల సూరత్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు జరుగుతుంది.  

సుమారు మూడు లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. భారత వినియోగదారులకు నాణ్యమైన అమెరికా ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. అంతేగాక, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి అమెరికాతో వాణిజ్య బంధాన్ని భారత్ మరింత బలోపేతం చేసుకోవచ్చు. టెక్స్‌‌‌‌టైల్స్, లెదర్, జెమ్స్ అండ్ జువెలరీ, ఫార్మా,  విమాన విడిభాగాల కంపెనీలకు అమెరికా మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.   

ఏయే రంగాలకు ఎంత మేలు ?


టెక్స్‌‌టైల్స్, అప్పారెల్ : టెక్స్‌‌టైల్స్ రంగం ఈ ఒప్పందం వల్ల అత్యధిక ప్రయోజనం పొందవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద దుస్తుల మార్కెట్ అయిన యూఎస్‌‌కు భారత ఎగుమతులు పెరుగుతాయి. సుంకాలు 18 శాతానికి తగ్గడం వల్ల భారత తయారీదారులు అమెరికా కొనుగోలుదారులకు తక్కువ ధరలకే వస్తువులను అందించవచ్చు. దీనివల్ల ఆర్డర్లు పెరగడమే కాకుండా లాభాలు కూడా మెరుగుపడతాయి. ఇతర ఆసియా దేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని భారత కంపెనీలు తమ మార్కెట్‌‌ను తిరిగి పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

లెదర్, ఫుట్‌‌వేర్ :  లెదర్, ఫుట్‌‌వేర్ ఎగుమతిదారులకు సుంకాల తగ్గింపు నేరుగా పోటీతత్వాన్ని పెంచుతుంది. విలువ ఆధారిత  లెదర్ వస్తువులకు యూఎస్ ప్రధాన కేంద్రం. తక్కువ సుంకాల వల్ల లాభాలు తగ్గకుండానే ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయించవచ్చు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ల వృద్ధికి, ఉపాధి కల్పనకు ఇది ఎంతో కీలకం. 

నగలు, రత్నాలు: రత్నాలు, వజ్రాలపై సుంకాలు సున్నాకు తగ్గించడం వల్ల ఈ రంగానికి తక్షణమే భారీ ప్రయోజనం చేకూరుతుంది. పాలిష్ చేసిన వజ్రాలు, నగలను కొనుగోలు చేయడంలో యూఎస్ మొదటిస్థానంలో ఉంది. సుంకం లేకపోవడంతో అమ్మకాలు, లాభాలు రెండూ పెరుగుతాయి. ఇది భారత్‌‌ను గ్లోబల్ ప్రాసెసింగ్ హబ్‌‌గా మార్చడానికి దోహదపడుతుంది.

జెనరిక్ మందులు: జెనరిక్ మందుల రంగం కూడా ఈ ఒప్పందంతో ఎంతో లాభపడనుంది. అనేక జెనరిక్ మందులపై సున్నా సుంకాలు ఉండటం, నిబంధనల విషయంలో స్పష్టత రావడం వల్ల యూఎస్‌‌కు చౌకైన మందులను సరఫరా చేయడంలో భారత్ పాత్ర బలపడుతుంది. కఠినమైన నిబంధనలు ఉండే యూఎస్ మార్కెట్‌‌లో భారత ఫార్మా కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.

విమానాల విడిభాగాలు : విమాన విడిభాగాల సరఫరా కోసం సెక్షన్ 232 నుంచి భారత్‌‌కు అమెరికా మినహాయింపు ఇచ్చింది. ఇది దేశీయ ఏరోస్పేస్ రంగానికి కీలకమైన విజయం.  సుంకాల తొలగింపు వల్ల విమాన విడిభాగాలను భారత్‌‌లో తయారు చేయడం సులభం అవుతుంది. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా నిపుణులకు ఉపాధి కల్పిస్తుంది.

 
అమెరికాకు కూడా  ఎన్నో లాభాలు.. 

అమెరికా నుంచి దిగుమతి అయ్యే దాదాపు 98 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలను మనదేశం పూర్తిగా తొలగించింది. గతంలో వీటిపై సగటున 13.5 శాతం సుంకం ఉండేది.   పండ్లు, కూరగాయలు, వాల్​నట్స్, బాదం వంటి నట్స్, వైన్, స్పిరిట్స్, సోయాబీన్ ఆయిల్, ఎర్ర జొన్నలపై టారిఫ్​లను భారత్ రద్దు చేస్తోంది.  

మన దేశ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చీజ్​పైనా సుంకాన్ని (40శాతం వరకు) తగ్గించలేదు. వరి, గోధుమ, మక్కలపైనా పాత టారిఫ్​లే (80 శాతం)ఉంటాయి. దీనితో పాటు భారత్ అమెరికా నుంచి రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇంధనం, విమానాలు, విలువైన లోహాల వంటివి ఉన్నాయి.

 పెట్టుబడిదారులకు  ప్రయోజనం

ఈ ఒప్పందం కేవలం ఎగుమతులకే కాకుండా నిబంధనల సరళీకరణకు కూడా తోడ్పడుతుంది. వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాలను భారత్ సురక్షితంగా ఉంచుకుంది. ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈలు, పెట్టుబడిదారులకు ఈ రంగాలు కొత్త పెట్టుబడులను తెచ్చిపెడతాయి.  సుంకాలు తగ్గడం వల్ల చైనా వంటి దేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవచ్చు. అమ్మకాలను పెంచుకోవచ్చు.