ఏదుల రిజర్వాయర్​ నిర్వాసితుల ఆవేదన

ఏదుల రిజర్వాయర్​ నిర్వాసితుల ఆవేదన

వనపర్తి, గోపాల్ పేట వెలుగు :
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ కోసం ఎనిమిదేండ్ల కింద భూములు, ఇండ్లు ఇచ్చిన బండరాయిపాకుల, కొంకలపల్లి బాధితులు తమను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించాలని ఏడు రోజులుగా భార్యా పిల్లలతో కలిసి నిరశన కొనసాగిస్తున్నారు. అయినా అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తమ వంక కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లేమో స్ట్రక్చరల్​ వాల్యూకు సంబంధించి టోకెన్లు సిద్ధం చేస్తున్నామని, రిజర్వాయర్ ​నీటి మట్టం పెరుగుతున్నందున ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

కూలిపోతున్న ఇండ్లతో భయం భయంగా...


ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం బండరాయిపాకులు, కొంకలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 1000 మంది నుంచి ఎనిమిదేండ్ల కింద భూములు తీసుకుంది. అప్పడు పరిహారం ఇచ్చినా -తమ ఇండ్లకు స్ట్రక్చర్ వ్యాల్యూ, గుడ్ విల్ తో పాటు 18 ఏండ్లు నిండిన వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్​చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలామంది గ్రామాల్లోని పాత ఇండ్లను ఖాళీ చేయకుండా అందులోనే ఉంటున్నారు. ఇండ్లు కూలిపోతున్నాయని, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని కంటతడి పెడుతున్నారు. సర్కారు స్ట్రక్చరల్ వాల్యూ ఇవ్వడం లేదని, అలాగని కొత్త ఇండ్లు కట్టుకోవడానికి అనుమతి కూడా ఇవ్వడం లేదంటున్నారు. దీంతో భయంతో బతుకుతున్నామంటున్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్​లో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందంటున్నారు. దీంతో గత వర్షాకాలంలో మిద్దె కూలి సర్పంచ్ లచ్చమ్మ, ఆమె మనవడు కన్ను మూశారని చెప్పారు. ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లలోకి రిజర్వాయర్ నీరు చేరుతోందని, అయినా అధికారులు ఎవరూ తమ దగ్గరకు రావడం రాలేదంటున్నారు. 

494 మందికే ప్లాట్లు ఇచ్చిన్రు


ఆర్అండ్​ఆర్ సెంటర్​లో 976 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు అవసరం కాగా, 494 మందికి మాత్రమే ప్లాట్లు ఇచ్చారని నిర్వాసితులు చెబుతున్నారు. గౌరీదేవిపల్లి, కొంకలపల్లిల్లో రెండు సెంటర్లు ఏర్పాటు చేసినా ఎక్కువ మంది గౌరీదేవిపల్లిలోనే ఇవ్వాలని కోరుతున్నారు. కొంకలపల్లికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. కరెంటు, తాగునీటి సౌకర్యం కల్పించలేదని ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. 25  మంది పేర్లు నిర్వాసితుల జాబితాలో లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీని గురించి వనపర్తి ఆర్డీఓ, కలెక్టర్ ను కలిసి వివరించినా సమస్యను పరిష్కరించడం లేదని చెబుతున్నారు.  

భయం భయంగా...


ప్రభుత్వం కఠిన వైఖరి మానుకొని వెంటనే నష్టపరిహారంతోపాటు పునరావాసం కల్పించాలి. ఆర్​అండ్​ఆర్​ సెంటర్​లో వసతుల్లేవు. పాత ఇండ్లల్లో భయం భయంగా గడుపుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి.   
–  రామచంద్రమ్మ, నిర్వాసితురాలు, బండరావిపాకుల

అధికారులు రావట్లేదు  


ఏడు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు మా గ్రామం వైపు రావడం లేదు. మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు కూలిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.  
– బాలస్వామి, నిర్వాసితుడు, బండరావిపాకుల

రైతు సంఘం తరపున పోరాటం
 ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ముంపు గ్రామాలకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. భూములు, ఇండ్లు సర్వం కోల్పోయిన వారు ఎట్లా బతకాలె. సర్కారు స్పందించకపోతే రైతు సంఘం తరపున పోరాటాలు ఉధృతం చేస్తాం.  
–  గోపి, తెలంగాణ రైతు సంఘం, వనపర్తి జిల్లా అధ్యక్షుడు