జమ్మికుంట, వెలుగు: గ్రామానికి కీడు సోకిందని తెల్లవారుజామునే గ్రామస్తులంతా ఇంటికి తాళాలు వేసి కీడు వంటలకు వెళ్లారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఈ ఘటన జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం గ్రామంలో గత రెండు మూడు నెలల నుంచి వరస మరణాలు జరిగాయి. దీంతో గ్రామస్తులు ఓ పూజారి వద్దకు వెళ్లారు. ఆయన కీడువంటలకు వెళ్లాలని గ్రామస్తులకు సూచించాడు.
దీనిపై గ్రామంలో ఒక్కరోజు ముందే డప్పు చాటింపు వేసి, కీడు వంటలకు వెళ్లాలని తెలిపారు. దీంతో బుధవారం తెల్లవారుజామునే గ్రామస్తులంతా కీడు వంటలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. గతంలో ఇలానే జరిగితే గ్రామాన్ని వదిలి కీడు గంటలకు వెళ్ళామని అప్పుడు మరణాలు ఆగిపోయాయని గ్రామస్తులు తెలిపారు. ఆధునిక యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలేంటని పలువురు అభిప్రాయపడ్డారు.
