మణిపూర్​పై రాహుల్​ గాంధీ.. బీజేపీ మాటల యుద్ధం

మణిపూర్​పై రాహుల్​ గాంధీ.. బీజేపీ మాటల యుద్ధం
  • ప్రధాని మాటైనా మాట్లాడలేదు: రాహుల్ 
  • రాహుల్.. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నడు: స్మృతి ఇరానీ 

న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ‘‘మణిపూర్ మండిపోతున్నది. దీనిపై యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ చర్చించింది. కానీ మన ప్రధాని మోదీ మాటైనా మాట్లాడలేదు. 

ఇదే సమయంలో రఫెల్ వల్ల బాస్టిల్లె డే పరేడ్ లో పాల్గొనేందుకు మోదీకి టికెట్ లభించింది” అని ఆయన శనివారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ కూడా కేంద్రంపై విమర్శలు చేశారు. ‘‘1977 జనవరిలో ప్రముఖ ఆర్థికవేత్త రిచర్డ్ నెల్సన్ యేల్ యూనివర్సిటీలో ఒక వ్యాసం ప్రచురించారు. దాని పేరు ‘‘ది మూన్ అండ్ ది ఘెట్టో’’. ఆయన అందులో ఒక ప్రశ్న వేశారు. 

‘టెక్నాలజీని అందిపుచ్చుకున్న అమెరికా.. మనిషిని చంద్రుడి పైకి పంపగలిగింది. కానీ దేశంలోని అంతర్గత సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నది’ అని ప్రశ్నించారు. ఇప్పుడు దీన్ని మన దేశానికి అన్వయించి.. ‘ది మూన్ అండ్ మణిపూర్’ అని చదువుకోవాలి” అని జైరామ్ రమేశ్ అన్నారు. 

రాహుల్.. ఓర్వలేకపోతున్నడు: బీజేపీ 

రాహుల్ కామెంట్లపై బీజేపీ మండిపడింది. ‘‘రాహుల్.. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశాల జోక్యం కోరుకుంటున్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆయన.. ‘మేకిన్ ఇండియా’ ఆశయాలను తుంగలో తొక్కారు. ప్రధాని మోదీకి విదేశాల్లో అత్యున్నత పురస్కారం లభిస్తే ఓర్వలేకపోతున్నారు. రక్షణ ఒప్పందాలు తమ దగ్గరికి రావడం లేదని రాహుల్ నిరాశలో ఉన్నారు” అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. 

మణిపూర్ లో తలెత్తిన వివాదంపై రాహుల్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఐటీ డిపార్ట్ మెంట్ హెడ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. ‘‘మణిపూర్ పై ఈయూ పార్లమెంట్ లో చర్చ యాదృచ్ఛికంగా జరిగింది కాదు. రాహుల్ లండన్ వెళ్లి, విదేశాల జోక్యం కోరారు” అని ఆయన ఆరోపించారు.