రైతులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ

 రైతులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ

హైదరాబాద్, వెలుగు: వడగండ్ల వానలతో ఇప్పటికే అతలాకుతలమవుతోన్న రైతులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. శనివారం మరోసారి వడగండ్ల వానలు కురిసే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు చోట్ల వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం కొన్ని చోట్ల.. ఆదివారం రాష్ట్రమంతటా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. హైదరాబాద్​లో శని, ఆదివారాల్లో మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. కాగా, గురువారం ఆదిలాబాద్, మహబూబ్​నగర్​లలో 37 డిగ్రీలు, భద్రాచలంలో 36.2, ఖమ్మంలో 36 డిగ్రీల టెంపరేచర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.