ఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్

ఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్
  • ఆస్పత్రి గేట్ దగ్గరే ప్రాణాలు పోయినయ్
  • 6 దవాఖాన్లు తిరిగినా ఒక్కరూ చేర్చుకోలే
  • గాంధీ నుంచి కోఠికి.. కోఠి నుంచి గాంధీకి తిప్పిన వైనం
  • వెంటిలేటర్లు ఫుల్ అంటూ వెనక్కి పంపిన ప్రైవేటు హాస్పిటల్స్
  • శుక్రవారం కోఠి హాస్పిటల్‌‌ గేట్ దగ్గరే ప్రాణాలొదిలిన మహిళ

హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్ల నిర్లక్ష్యానికి మరో మహిళ బలి అయింది. ‘ఎన్ని డబ్బులైనా పెట్టుకుంటాం. బతికించండి’ అని ప్రాధేయపడినా ఒక్క ప్రైవేట్ హాస్పిటల్‌ కూడా చేర్చుకోలేదు. ప్రభుత్వ దవాఖాన్లకు వెళ్తే.. అటు ఇటు తిప్పారే తప్ప పట్టించుకోలేదు. రెండు రోజుల్లో 6 హాస్పిటల్స్‌కు తిరిగి, ట్రీట్‌మెంట్‌ అందక హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందిన సత్తమ్మ (55) అనే మహిళ శుక్రవారం కోఠి ప్రభుత్వాసుపత్రి గేట్ దగ్గరే కన్నుమూసింది. అందరూ కలిసి ప్రాణాలు తీశారంటూ ఆమె అల్లుడు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ నెల 22న మా మామ చనిపోయిండు. ఇంతలోనే అత్తమ్మ సిక్ అయింది. 24న ఏఎస్ రావునగర్‌‌లోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. కరోనా లక్షణాలు ఉన్నాయని, వేరే హాస్పిటల్‌కు వెళ్లాలని వాళ్లు చెప్పారు. ఆ రోజు ఇంటికెళ్లిపోయాం. గురువారం పొద్దున తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. కరోనా లక్షణాలు ఉన్నాయని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండని ఆయన చెప్పారు. సికింద్రాబాద్​లో ఓ హాస్పిటల్‌కు వెళ్లాం. వెంటిలేటర్లు ఫుల్ అయ్యాయి. వేరే దగ్గరికి వెళ్లమన్నారు” అని సత్యనారాయణ చెప్పారు.

గాంధీ గేటు దగ్గరే ఆపేశారు

సికింద్రాబాద్ నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లామని, గేట్ దగ్గరే పోలీసులు ఆపేశారని సత్యనారాయణ చెప్పారు. ‘‘పాజిటివ్ వచ్చిన రిపోర్ట్‌ ఉంటేనే గాంధీలో చేర్చుకుంటారని, కింగ్ కోఠికి వెళ్లాలని చెప్పారు. వెంటనే కోఠికి వెళ్లినం. వాళ్లు ‘వెంటిలేటర్ పెట్టాలి. ఇక్కడ ఖాళీ లేవు.. గాంధీకి వెళ్లండి’ అని చెప్పారు. ‘ముందు అక్కడికే పోయినం.. వాళ్లే ఇక్కడికి వెళ్లమన్నారు’ అని మేం అన్నం. దీంతో ‘ఒక స్లిప్ రాసిస్తం.. ఇది చూపెడితే గాంధీలో చేర్చుకుంటరు’ అని చెప్పి పంపారు. కోఠిలో ఇచ్చిన స్లిప్​ను గాంధీలో చూపిస్తే పట్టించుకోలేదు’’ అని చెప్పారు.

‘మీ కోసం వేరే వాళ్ల వెంటిలేటర్ తీసేయాలా’

ఉస్మానియాకు వెళ్తే అడ్మిట్ చేసుకున్నట్టే చేశారని.. కానీ అడ్మిట్ కార్డు తీసుకున్నాక బెడ్లు లేవన్నారని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వెంటిలేటర్‌‌ కోసం వెయిటింగ్‌లో చాలా మంది ఉన్నారు. మీకోసం వేరే వాళ్ల వెంటిలేటర్ తీసేయాలా’ అని బెదిరించారన్నారు. దీంతో బోడుప్పల్‌లోని ఇంకో ఆస్పత్రికి వెళ్లామని, అక్కడా చేర్చుకోలేదని చెప్పారు.

కాళ్లు పట్టుకున్నా కనికరించలే
‘‘మళ్లీ ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాం. బతికించాలని అక్కడ ఉన్న వ్యక్తి కాళ్లు పట్టుకున్నాం. ‘రేపు (శుక్రవారం) బెడ్ ఖాళీ అవుతుంది. నంబర్ ఇచ్చి వెళ్లండి. కాల్ చేస్తాం’ అని చెప్పి పంపారు. శుక్రవారం పొద్దున బంజారాహిల్స్‌ లోని ఓ ఆస్పత్రికి వెళ్లాం. పేషెంట్‌ను చూసి ‘వెంటిలేటర్ పెట్టాలి. కానీ, ఖాళీగా లేవు’ అన్నారు. అక్కడి నుంచి మళ్లీ గాంధీకి వెళ్లినం. అడ్మిట్ చేసుకోలేదు. కోఠికి తీసుకెళ్లినం. ఎవరూ పట్టించుకోలేదు. గేటు దగ్గరే గంటన్నర ఉన్నం. ఇద్దరు డాక్టర్లు వచ్చి అంబులెన్స్​లో ఉన్న అత్తమ్మను చూశారు. వాళ్లు ఏం చేయాలో మాట్లాడుకుంటుండగానే, అత్తమ్మ ప్రాణాలు పోయాయి. కనీసం ఇప్పుడైనా కరోనా టెస్ట్ చేయమని అడిగితే.. ‘డెడ్‌బాడీస్‌కు టెస్ట్ చేయం’ అని చెప్పారు. చేసేది లేక అక్కడి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశాం’ అని సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారు.

రాష్ట్రంలో మరో 985 మందికి కరోనా