కౌన్సెలింగ్: పంటి సమస్యలు ఇలా తగ్గించొచ్చు

కౌన్సెలింగ్: పంటి సమస్యలు ఇలా తగ్గించొచ్చు

ప్రపంచంలో 45 శాతం మంది నోటి సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. అంతేకాదు, మనదేశంలో పళ్లు, చిగుళ్ల సమస్యలతో బాధపడేవాళ్లలో 50 శాతానికి పైగా డాక్టర్ల దగ్గరకు వెళ్లడంలేదని స్టడీలు చెప్తున్నాయి. మరయితే ఓరల్ హెల్త్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాలే చెప్పారు డాక్టర్ శ్రీనివాస్.

ప్రపంచవ్యాప్తంగా జలుబు, దగ్గు ఎంత కామన్‌‌గా వస్తుంటాయో... నోటి సమస్యలు కూడా అంతే కామన్‌‌గా వస్తున్నాయని ఓ సర్వే చెప్తోంది. అయితే ఓరల్ హెల్త్ గురించి చాలామందిలో అవేర్‌‌‌‌నెస్ తక్కువ. పంటి నొప్పి లేదా చిగుళ్ల నొప్పి వస్తే కానీ వాటి ఇంపార్టెన్స్ తెలియదు. డెంటల్ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా చాలామంది డెంటిస్ట్‌‌లను కలవరు. దీంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయి. పళ్లు, చిగుళ్ల సమస్యలను పట్టించుకోకపోతే అవి మరింత ఎక్కువై పళ్లు ఊడిపోవచ్చు. కొన్నిసార్లు మౌత్ క్యాన్సర్‌‌‌‌ కూడా రావచ్చు. అందుకే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

తెల్లగా బయటకు కనిపించే పంటిలో 4 భాగాలు ఉంటాయి. పంటి పైన లేయర్‌‌‌‌లో ‘ఎనామిల్’ పొర ఉంటుంది. దానికింద ‘డెంటిన్’, ఆ తర్వాత పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు, వాటి కింద పంటి ఎముక ఉంటాయి. అయితే ఈ నాలుగు ఆరోగ్యంగా ఉంటేనే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చినా ఇబ్బందే. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల చాలామందిలో చిగుళ్ల వాపు, పిప్పి పళ్లు, పళ్లు జివ్వుమని లాగడం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

పిప్పి పళ్లు

దీన్నే డెంటల్ కావిటీస్ అంటారు. మామూలుగానే నోటిలో బ్యాక్టీరియా ఉంటుంది. ఏదైనా తిన్న తర్వాత నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే ఆ బ్యాక్టీరియా మరింత ఎక్కువై, పంటి పైన ఉండే ఎనామిల్ పొర దెబ్బ తింటుంది. లోపలుండే డెంటిన్‌‌ బయటపడుతుంది. చల్లటి పదార్థాలు తిన్నప్పుడు అక్కడి నాడులు యాక్టివేట్ అయ్యి జివ్వుమని లాగుతుంటాయి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ఫెక్షన్‌‌ తగ్గించొచ్చు. లేకపోతే అది మరింత పెరిగి పళ్లు పుచ్చిపోతాయి. అందుకే పళ్లు జివ్వుమంటుంటే కనుక వెంటనే డెంటిస్ట్‌‌ను కలవాలి.

చిగుళ్ల వాపు

తిన్న పదార్థాలు చిగుళ్ల మధ్యలో ఉండిపోతే అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నొప్పి వంటివి మొదలవుతాయి. చాలామంది ‘చిగురు వాపే’ అని వదిలేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్‌‌ చిగుళ్ల కిందికి వ్యాపిస్తుంది. పంటి ఎముక కూడా ఇన్‌‌ఫెక్షన్‌‌కు గురవుతుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డెంటిస్ట్‌‌ను కలిసి పళ్లు క్లీన్ చేసుకుంటే సమస్య తగ్గుతుంది. లేదంటే ఇన్ఫెక్షన్‌‌ ముదురుతుంది.

నోటిలో పుండ్లు

నోటిలో తరచుగా పొక్కులు వస్తుంటాయి చాలామందికి.  నోటి పుండ్లు అల్సర్ లక్షణం కావచ్చు. కొన్నిసార్లు అల్సర్లు క్యాన్సర్‌‌‌‌కు దారితీస్తాయి. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ అవసరం. నోటిపూత పది రోజుల తర్వాత కూడా తగ్గకపోతే, మింగడానికి ఇబ్బందిగా ఉంటే లేదా ఏదైనా తిన్న తర్వాత నోటిలో నొప్పిగా ఉంటే..  వెంటనే డాక్టర్‌‌ను కలవాలి.

కారణాలివే..

దంత సమస్యలకు చాలా కారణాలుంటాయి.  చాలామంది దంతాలు తెల్లగా ఉండాలని రోజూ 10 నుంచి15 నిమిషాలు గట్టిగా తోముతుంటారు. దీనివల్ల ఎనామిల్‌‌ అరిగిపోతుంది. పన్ను సున్నితంగా తయారవుతుంది. పళ్లు జివ్వుమనడానికి కారణం ఇదే. అలాగే కొందరు ఉప్పు, బొగ్గు వంటి గరుకు పదార్థాలతో పళ్లు తోముతుంటారు. అలా చేసినా ఎనామిల్‌‌ అరిగిపోతుంది. జ్యూస్‌‌, కూల్‌‌ డ్రింక్స్ లాంటివి తాగినప్పుడు వెంటనే పుక్కిలించి పళ్లను శుభ్రం చేసుకోవాలి. లేదంటే అక్కడ సిట్రిక్ యాసిడ్ తయారై అది ఎనామిల్‌‌ను తినేస్తుంది. క్యాల్షియం లోపం కూడా పలు దంత సమస్యలకు కారణం. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ లాంటివి తిన్నప్పుడు పళ్లు శుభ్రం చేసుకోవాలి. డయాబెటిస్ పేషెంట్లకు నోటి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. వీళ్లు నోటిని ఎప్పుడూ క్లీన్‌‌గా ఉంచుకోవాలి. లేదంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.

ఇలా చేయాలి

ఉదయం పళ్లు తోమడంతో సరిపెట్టకుండా రాత్రి పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలావరకూ నోటి సమస్యలు రావు. సాఫ్ట్​గా ఉండే బ్రిస్టల్స్​ ఉన్న టూత్​ బ్రష్​ వాడాలి. మూడు నిమిషాలకు మించి పళ్లు తోమకూడదు. పళ్లను సున్నితంగా రుద్దాలి. పళ్లకు అంటుకుపోయే పదార్థాలు తిన్న తరువాత నోరు పుక్కిలించి, పళ్లను శుభ్రం చేసుకోవాలి. అలాగే భోజనం చేసిన ప్రతీసారీ నీళ్లతో పుక్కిలిస్తే, పళ్ల మధ్యలో చిక్కుకున్న పదార్థాలు పోతాయి. లేకపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది.

పుల్లటి పదార్థాలను తిన్నప్పుడు నీళ్లతో పుక్కిలించడం మర్చిపోవద్దు. అలాగే తిన్న వెంటనే కాకుండా అరగంట తరువాత పళ్లు రుద్దాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల నోరు తేమగా ఉంటుంది. సెలైవా ఆరిపోదు. ఇది చిగుళ్లకు, పళ్లకు మంచిది.
వీటన్నింటితో పాటు సమస్యా ఉన్నా, లేకున్నా ఏడాదికొకసారి ఓరల్ చెకప్ చేయించాలి. ఆరు నెలలకోసారి పళ్లను క్లీనింగ్ చేయించాలి.

-డా. శ్రీనివాస రావు, సీనియర్ కన్సల్టెంట్, డెంటల్ సర్జన్, కేర్ హాస్పిటల్స్