90 వేల ఎకరాలకు పురుగు తగిలింది

90 వేల ఎకరాలకు పురుగు తగిలింది
  • ఖమ్మంలో నిండా మునిగిన మిర్చి రైతులు 
  • మొత్తం లక్ష ఎకరాల్లో సాగు.. దాదాపు 90 శాతం తోటల్లో తెగుళ్లు 
  • ఇప్పటికే 10 వేల ఎకరాల్లో పంట పీకేసిన రైతులు 
  • ఆవేదనతో నెల రోజుల్లోనే నలుగురు రైతుల ఆత్మహత్య 

ఖమ్మం, వెలుగు: ఈసారి మిర్చి రైతులను తెగుళ్లు నిండా ముంచాయి. తామర పురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగులు, కాయ కుళ్లు తెగులు, ఆకుమచ్చ తెగులు కారణంగా వేలాది ఎకరాల్లో తోటలు నాశనమయ్యాయి. మొక్క మొత్తాన్నీ గుల్ల చేసే తామర పురుగు వ్యాప్తిని మందులు కూడా అడ్డుకోలేకపోతున్నాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 90 వేల ఎకరాల్లో తెగుళ్లు సోకాయి. ఇప్పటికే పంట సాగుకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు రూ.వేలు ఖర్చు చేసి పురుగు మందులు కొట్టినా ఫలితం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం సగం పంటనన్నా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇస్తున్న సలహాలు, సూచనలతోనూ ఫలితం ఉండడం లేదంటున్నారు. తెగుళ్లతో వేల ఎకరాల్లో పంట నాశనమవుతున్నా, అధికారుల దగ్గర ఆ లెక్కలే లేవని ఆరోపిస్తున్నారు. 
తోటలను పీకేసీ మక్కల సాగు... 
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3,58,557 ఎకరాల్లో రైతులు మిర్చి వేశారు. ఇందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 40 వేల మంది రైతులు 1,03,021 ఎకరాల్లో తోటలు పోశారు. 
అయితే వీటిలో దాదాపు 90 శాతం ఎకరాలకు తెగుళ్లు సోకాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. తెగుళ్లు ఎక్కువ సోకి, పంట నాశనం కావడంతో రైతులు తోటలను తొలగిస్తున్నారు. ఇప్పటికే 10 వేల ఎకరాల్లోని తోటలను ట్రాక్టర్లతో దున్నించారు. ఆ చేన్లలో మక్కలు, పెసర పంటలను సాగు చేస్తున్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులను ఎట్ల తీర్చుడని ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో దెబ్బ తినడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో నలుగురు రైతులు సూసైడ్ చేసుకున్నారు. వీరిలో ఇద్దరు కౌలు రైతులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, మిర్చి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. పంటకు నష్ట పరిహారం ప్రకటించి.. ఉచితంగా ఎరువులు, పురుగుల మందులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 
నలుగురు రైతుల సూసైడ్... 
తల్లాడ మండలం బాలపేటకు చెందిన కౌలు రైతు పులి వెంకటరామయ్య (40) ఎకరం సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. పెట్టుబడికి రూ.5 లక్షల అప్పు చేశాడు. తెగుళ్లతో పంట దిగుబడి రాకపోవడంతో అప్పు కట్టేందుకు రెండు ఎడ్లను రూ.50 వేలకు అమ్మాడు. మిగిలిన అప్పు ఎట్ల కట్టుడని మనస్తాపానికి గురై నవంబర్ 22న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

కారేపల్లి మండలం గేట్ రేలకాయలపల్లికి చెందిన గిరిజన రైతు వాంకుడోత్ పుల్లు(58)కు మూడున్నర ఎకరాలు ఉండగా, మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడున్నర ఎకరాల్లో మిర్చి, రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాలకు పత్తి దెబ్బతినగా, తెగుళ్లతో మిర్చి తోట ఖరాబైంది. పెట్టుబడి కోసం తెచ్చిన రూ.5 లక్షల అప్పులు తీర్చే మార్గం లేక నవంబర్ 29న తన మిర్చి తోటలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య 
చేసుకున్నాడు. 

తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన మేడి శ్రీనివాసరావు (51) తనకున్న ఎకరంన్నరలో మిర్చి సాగు చేశారు. తెగుళ్లతో పంట పాడైపోయింది. అప్పుల బాధతో నవంబర్​26న ఆత్మహత్య చేసుకున్నాడు. 
రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన నాగండ్ల నాగేశ్వరరావు (60) మూడెకరాల్లో మిర్చి సాగు చేయగా, తోటంతా తెగులు సోకింది. నవంబర్ 26న తోటకు మందులు వేసేందుకు వెళ్లిన నాగేశ్వరరావు.. అక్కడి పరిస్థితి చూసి ఆవేదన చెందాడు. ఈ ఏడాది కూడా పంట చేతికి రాదని, అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 
చదువు ఆపేసిన.. 
నేను చదువుకొని ఉద్యోగం సాధించాలి అనుకున్న. కానీ, మా నాన్న వెంకట్రామయ్య ఆత్మహత్య చేసుకోవడంతో అమ్మపై భారం పడింది. దీంతో నేను చదువు మానేసి. పొలం పనులు చూసుకుంటున్న. - పులి ఉదయ్ కిరణ్, బాలపేట, తల్లాడ మండలం
మక్కలు వేసిన..  
మూడెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి వేసిన. తెగుళ్లతో ఎకరానికి రూ.లక్ష వరకు నష్టపోయా. కనీసం కౌలు డబ్బులైన వస్తయని, మిర్చి తోటను తొలగించి మక్క సాగు చేస్తున్న. - చింతకాయల బూసి, బాణాపురం, ముదిగొండ మండలం
రెండు పంటలేసినా దక్కలే... 
ఆరు ఎకరాల్లో మిర్చి వేసిన. వేరు కుళ్లు తెగులుతో బాగా నష్టపోయాను. మిర్చి కంటే ముందు పెసర వేస్తే, వర్షాలతో మొత్తం పాడైంది. దాన్ని దున్ని మిర్చి వేస్తే అదీ దక్కలేదు. దాంతో మిర్చి తోటను దున్నేసి మక్క వేసిన. -షేక్ బందెల్లి, మాదారం, కారేపల్లి మండలం.