- ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉంటేనే రాజకీయ వ్యవస్థ నిర్మాణం సాధ్యం: పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ బలం దాని సిద్ధాంతం, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన కార్యకర్తలేనని ఆ పార్టీ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల జాతీయ సహ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చెన్నైలోని పల్లవరంలో జరిగిన తమిళనాడు బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బీజేపీలో శిక్షణ అనేది కేవలం కార్యక్రమం కాదని, అది పార్టీ సంస్థాగత సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్నారు.
సిద్ధాంత స్పష్టత, నిరంతర అభ్యాసం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉంటేనే బలమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలైన ఏకాత్మ మానవ దర్శనం, అంత్యోదయ గురించి పొంగులేటి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో చిట్టచివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా అందాలన్నదే అంత్యోదయ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ అంత్యోదయ సూత్రాలు.. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి రూపంలో అద్భుతమైన పరిపాలనగా మారుతున్నాయని కొనియాడారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ప్రజలతో మమేకమై ఉండటమే బీజేపీ కార్యకర్తల గొప్పతనమని ప్రశంసించారు. భారతదేశ నాగరికత ప్రయాణంలో తమిళనాడుకు ప్రత్యేక స్థానం ఉందని పొంగులేటి అన్నారు.
తమిళ అస్తిత్వం, భారతీయ అస్తిత్వం ఒకదానికొకటి వ్యతిరేకం కాదు.. అవి ఒకదానికొకటి బలాన్ని ఇస్తాయన్నారు. తమిళనాడు గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా గర్వంగా చాటి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, తమిళనాడు బీజేపీ ఇన్‌చార్జ్ అరవింద్ మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సహా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
