పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఇటీవల శిశువుల విక్రయాలు కలకలం నెలకొంది. మూడు రోజుల కింద కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాత్పల్లికి చెందిన సంచార జాతుల కుటుంబాలకు చెందిన మహిళలు శిశువులను విక్రయించినట్లు బయటకు వచ్చింది. దీంతో కేసులు అవుతాయన్న భయంతో శిశువులను కొన్నవారు తిరిగి తల్లులకు అప్పగించారు. పోలీసులు ఎంక్వైరీ జరిపి.. సోమవారం కరీంనగర్‌లోని శిశుగృహకు తరలించారు.
కాగా ఒక్కో శిశువును రూ.6లక్షల నుంచి రూ.8లక్షల వరకు అమ్మినట్లు సమాచారం. దీనిపై శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ విచారణ జరిపింది. ఈ విషయమై ఎంసీహెచ్ సూపరింటెండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ శిశు విక్రయాల ఘటన ఎంసీహెచ్‌కు సంబంధం లేదన్నారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కాగా సంతానం లేని దంపతులు పేద వర్గాలకు చెందిన సంచార జాతులతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని ఇలాంటి క్రయవిక్రయాలకు ఒడిగడుతున్నట్లు తెలిసింది. గర్భిణులుగా ఉన్నప్పుడే సదరు కుటుంబాలతో ముందస్తుగానే ఒప్పందాలు చేసుకొని సదరు మహిళ డెలివరీ కాగానే హాస్పిటల్ నుంచే శిశువులను తీసుకెళ్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటనలో పలు శాఖలకు చెందిన ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
