
హైదరాబాద్: పాత పద్ధతిలోనే పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలంటూ విద్యార్థి సంఘాలు చేస్తున్నఉద్యమంతో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీహెచ్డీ అడ్మిషన్ల గురించి కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా... ఓయూ పాలకవర్గం పట్టించుకోవడం లేదంటూ గురువారం పెద్ద ఎత్తున విద్యార్థులు వీసీ చాంబర్ లోకి వెళ్లారు. అనంతరం తమ డిమాండ్స్ గురించి వీసీ రవీందర్ కు వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వీసీ, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వీసీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వీసీ ప్రవర్తన పట్ల విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ... కులం పేరుతో దూషిస్తూ వీసీ తమను అవమానించారని తెలిపారు. వీసీపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ కు సరైన సమాధానం ఇవ్వలేక వీసీ పారిపోయారని ఆరోపించారు. ఇప్పటికైనా సమర్థుడైన వ్యక్తిని వీసీగా నియమించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. ఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు... అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.