పాతబస్తీలో అగ్ని ప్రమాదానికి కారణమేంటి?.. 48 గంటలు గడిచినా నో క్లారిటీ

పాతబస్తీలో అగ్ని ప్రమాదానికి కారణమేంటి?.. 48 గంటలు గడిచినా నో క్లారిటీ
  • షార్ట్​సర్క్యూట్​ అంటున్న  ఫైర్​ సేఫ్టీ డిపార్ట్​మెంట్​
  • కాదంటున్న విద్యుత్ శాఖ.. ఎటూ తేల్చని అధికారులు
  • కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు .. 48 గంటలు గడిచినా నో క్లారిటీ

    
హైదరాబాద్​ సిటీ, వెలుగు: గుల్జార్ హౌస్ వద్ద  బిల్డింగ్​లో అగ్ని ప్రమాద ఘటన ఎలా జరిగిందన్న దానిపై క్లారిటీ రావడం లేదు. షార్ట్​సర్క్యూట్​అని ఒక శాఖ చెప్తుండగా, కాదని మరో డిపార్ట్​మెంట్​తోసిపుచ్చుతున్నది. ఏసీ కంప్రెషర్లపై ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని మరికొందరు చెబుతున్నా.. స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రెస్క్యూ చేసే ఫైర్​డిపార్ట్​మెంట్, షార్ట్​సర్క్యూట్​వల్ల ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తే నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పోలీసులు.. ఇలా ఏశాఖ కూడా ప్రమాదం ఎలా జరిగిందో చెప్తూ ఒక ప్రకటన కూడా చేయలేదు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు విచారణ జరపాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించి.. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక ప్రాథమిక అంచానకు కూడా రాలేకపోయారు.

 

ఫైర్​ డిపార్ట్​మెంట్ ​ఏం చెప్పిందంటే?

అగ్ని ప్రమాద ఘటన జరిగినప్పుడు ఒక మహిళ కేకలు విన్న నలుగురు యువకులు.. బాధితులను రక్షించేందుకు పైకి వెళ్లారు. ఫస్ట్​ఫ్లోర్​లో ఒక రూమ్​లో కొంతమంది అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. అక్కడ ఏసీ కంప్రెషర్​పేలి ఉన్నట్టు గమనించామని చెప్పారు. తర్వాత మూడున్నర గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఫైర్​సేఫ్టీ సిబ్బంది, అధికారులను ప్రమాదం ఎలా జరిగి ఉంటుందని ప్రశ్నించగా.. షార్ట్​సర్క్యూట్​వల్లే అగ్గి రాజుకుందని, తర్వాత ఏసీ కంప్రెషర్లు పేలడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రౌండ్​ ఫ్లోర్​లో షార్ట్​ సర్క్యూట్​జరిగి మంటలు వచ్చాయని, అవి ఇంట్లోకి వ్యాపించి ఆ తాకిడికి ఏసీ కంప్రెషర్లు బ్లాస్ట్​ అయ్యాయని తెలిపారు. ఆ ఇంట్లో షార్ట్​సర్క్యూట్​తో మెయిన్ వద్ద మంటలు వచ్చినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నదని చెప్పారు. దీంతో అందరూ షార్ట్​సర్క్యూట్​వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనాకు వచ్చారు.  

షార్ట్​ సర్క్యూట్​ కాదంటున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​ 

గుల్జార్​హౌస్ ​దగ్గర అగ్ని ప్రమాదం జరిగాక విద్యుత్​ శాఖ అధికారులు ప్రైమరీ ఎంక్వైరీ చేశారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్​సర్క్యూట్​కాదని తేల్చారు. మీటర్​బాగానే ఉందని, పోలీసులు తమకు ప్రమాదం గురించి చెప్పాకే కరెంట్​ కట్ ​చేశామన్నారు. షార్ట్​సర్క్యూట్​వల్ల మీటర్​ కాలిపోయి ఫీడర్​ట్రిప్​అవుతుందని, కానీ, అలాంటి ఆనవాళ్లే లేవని వెల్లడించారు. కాగా, ఘటనపై విద్యుత్ ​శాఖ విచారణ జరుపుతున్నదని, ఒకటి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలిసింది.   

దర్యాప్తు కొనసాగుతున్నదన్న పోలీసు శాఖ 

ఘటనపై ఎఫ్ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. 48 గంటలు గడిచినా ఎలాంటి స్పష్టత రాలేదని సమాచారం. మరోవైపు ఫైర్, ఎలక్ట్రిసిటీ అధికారుల ప్రకటనలు వారిని తికమక పెడుతున్నాయి. మీటర్లలోనే షార్ట్​ సర్క్యూట్ ​జరిగిందని ఫైర్​ఆఫీసర్లు చెప్తుంటే.. మీటర్లు సరిగ్గానే ఉన్నాయని ఎలక్ట్రిసిటీ అధికారులు  అంటున్నారు. ఆదివారం ప్రమాదం, రెస్క్యూ హడావిడి ఉండగా, సోమవారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​కు చెందిన ఏ అధికారి విచారణ కోసం ఘటనా స్థలానికి రాలేదు. ఇంటర్నల్​ఎంక్వైరీ మాత్రం జరుగుతున్నదని పోలీసులు చెప్పారు. అయితే, మరో కోణంలో ఆలోచించి క్లూస్​టీం అయినా ఆధారాలు సేకరిస్తుందని భావించినా, అదీ జరగలేదు.