
న్యూఢిల్లీ: రాబోయే మెన్స్ ఆసియా కప్, విమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి ఇండియా క్రికెట్ జట్లు వైదొలుగుతున్నాయన్న వార్తలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఊహాజనిత వార్తలు, పుకార్లనేనని స్పష్టం చేశారు. ఈ రెండు టోర్నమెంట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఏసీసీకి ప్రస్తుతం పాకిస్తాన్ మినిస్టర్ అయిన మోహ్‌సిన్ నఖ్మీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ టోర్నీలను ఇండియా బాయ్‌కాట్ చేస్తుందని బోర్డు వర్గాలు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సైకియా వీటిని ఖండించారు.
‘ఆసియా కప్, విమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో ఇండియా జట్లు పాల్గొనవని బీసీసీఐ నిర్ణయించిందనే వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటివరకు బీసీసీఐ ఈ ఏసీసీ ఈవెంట్స్ గురించి చర్చించలేదు. ఏసీసీకి ఎలాంటి లెటర్ రాయలేదు. ప్రస్తుతం మా దృష్టి ఐపీఎల్, జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌పై ఉంది. ఆసియా కప్ లేదా ఏసీసీ ఈవెంట్స్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. అందువల్ల ఈ వార్తలు పూర్తిగా ఊహాజనితమైనవే’ అని సైకియా స్పష్టం చేశారు. ఏసీసీ ఈవెంట్స్‌కు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చర్చ జరిగినా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా వాటిని మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.