రవీంద్రభారతి, వెలుగు: తెలంగాణలో 1.2 శాతం జనాభా ఉన్న కుమ్మరి సమాజం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం సామాజిక అసమానతకు నిదర్శనమని మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే. పూర్ణచంద్రరావు అన్నారు. కుమ్మరి జనాభా కంటే తక్కువ శాతం ఉన్న ఇతర సామాజిక వర్గాలకు డజన్ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ వివక్షను రూపుమాపాలంటే జనాభా శాతాన్ని రాజకీయ శక్తిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.
మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన ‘తెలంగాణ కుమ్మరి సర్పంచుల మహాసభ’లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికైన 94 మంది సర్పంచులు, 150 మంది ఉప సర్పంచులు, 1,500 మంది వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
భవిష్యత్లో కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. సంగెం సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ దశరథ్, ప్రొఫెసర్లు పార్థసారథి, తిరుమలి పాల్గొన్నారు.
