
మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్‌లో బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. నగరం నలుమూలల నుంచి హైటెక్ సిటీకి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. జేఎన్టీయూ నుంచి సైబర్టవర్స్, మలేషియన్ టౌన్షిప్ నుంచి మైండ్‌స్పేస్, హఫీజ్‌పేట్ నుంచి కొండాపూర్, షేక్‌పేట నుంచి ఖాజాగూడ, నానక్ రాంగూడ నుంచి గచ్చిబౌలి, లింగంపల్లి గుల్మోహార్పార్కు నుంచి గచ్చిబౌలి, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి, శిల్పా ఫ్లైఓవర్ నుంచి ఐకియా జంక్షన్ వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ట్రాఫిక్ సమస్య కొనసాగింది. ఫలితంగా ఐటీ ఉద్యోగులు, ఆయా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది సమయానికి డ్యూటీకి వెళ్లలేక.. గంటల తరబడి రోడ్లపై నరకయాతన అనుభవించారు. ఇటీవల ప్రారంభమైన పీజేఆర్ ఫ్లైఓవర్, అంజయ్యనగర్ యూటర్న్, బయోడైవర్సిటీ ట్రాన్స్‌కో యూటర్న్, ఖాజాగూడ నుంచి షేక్‌పేట రూట్లోనూ రద్దీ కొనసాగింది.
ట్రాఫిక్‌కు ఇదే ప్రధాన కారణం
రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సైబర్ టవర్స్ జంక్షన్ రూట్లోవెళ్లకుండాలెమన్ ట్రీ, టెక్ మహీంద్రా, మెటల్ చార్మినార్ జంక్షన్, ఎన్ కన్వెన్షన్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. వర్షం కురిసే సూచనలతో రోజూ బైక్‌లపై వచ్చే చాలా మంది ఐటీ ఉద్యోగులు బుధవారం ఎక్కువగా సొంత కార్లలో ఆఫీసులకు బయలుదేరడం ట్రాఫిక్రద్దీకి ప్రధాన కారమణని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకపోవడం కూడా ఒక కారణమన్నారు.