వర్సిటీలు, కాలేజీలపై పోలీసుల నిఘా

వర్సిటీలు, కాలేజీలపై పోలీసుల నిఘా

హైదరాబాద్, వెలుగు: ఇప్పటివరకూ యూనివర్సిటీల క్యాంపస్​లు, కాలేజీ ఆవరణలోకి పోలీసులు రావాలంటే సంబంధిత క్యాంపస్ ఉన్నతాధికారి పర్మిషన్ తప్పనిసరి ఉండేది. కానీ ఈ నిబంధనలు త్వరలో మారనున్నాయి. పోలీసులు విద్యా సంస్థల క్యాంపస్ లోకి వచ్చేందుకు అడ్డుగా ఉన్న పలు చట్టాల్లో మార్పులు చేయనున్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, ర్యాగింగ్ తదితర అంశాలకు సంబంధించి మాత్రమే క్యాంపస్​లోకి వచ్చేలా పోలీసులకు పర్మిషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. గురువారం ఉన్నత విద్యా మండలి ఆఫీసులో ‘విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతా చర్యలు– మద్దతు వ్యవస్థ’  అంశంపై సమావేశం నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, పోలీస్ ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, మహేశ్​  భగవత్, స్వాతి లక్రా, వర్సిటీల వీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని కాలేజీల్లో అమ్మాయిల అడ్మిషన్లు భారీగా పెరగడంతో వారికి సెక్యూరిటీ పెంచాల్సిన అంశాలపై చర్చించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్, సైబర్ క్రైమ్స్, లైంగిక వేధింపుల నుంచి యువతులను రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్యాంపస్ లెవెల్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు వేయాలని నిర్ణయించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్, కోచింగ్ సెంటర్లతో పాటు అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. కొత్త విద్యా సంస్థలు ప్రారంభమయ్యే రోజున స్టూడెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. అమ్మాయిలు సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేకంగా లేడీ ఆఫీసర్లను నియమించాలని, విద్యా సంస్థల్లో కంప్లైంట్ బాక్స్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సబితాఇంద్రా రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల భద్రత కోసం పోలీసులు, విద్యా శాఖ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నారు. వర్సిటీల్లో స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించాలని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ  విద్యా సంస్థల్లో  లైంగిక వేధింపులు, ర్యాంగింగ్, డ్రగ్స్ నిరోధానికి విద్యా శాఖతో కలిసి పనిచేస్తామన్నారు.