కరోనా నిబంధనల మేరకే తుంగభద్ర పుష్కరాలు

కరోనా నిబంధనల మేరకే తుంగభద్ర పుష్కరాలు

పుష్కర ఘాట్లలో థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే అనుమతి

సోషల్ డిస్టెన్స్.. మాస్కులు ధరించడం తప్పనిసరి

భక్తులకు షవర్ బాత్ సౌకర్యం

జోగులాంబ గద్వాల జిల్లా: తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పుష్కర స్నానాలకు అనుమతిస్తామని మంత్రుల బృందం స్పష్టం చేసింది. భక్తులు సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు.. మాస్కులు విధిగా ధరించాల్సి ఉంటుందని.. కరోనా మార్గదర్శకాల మేరకే అన్ని  ఏర్పాట్లు చేస్తామని మంత్రులు వివరించారు. ఈనెల20వ తేదీ నుండి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలపై రాష్ర్ట మంత్రుల బృందం సమీక్షించింది. ఆలంపూర్ హరిత టూరిజం హోటల్ లో తుంగభద్ర పుష్కరాలపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

తొలుత అలంపూర్లో జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తుంగభద్ర నది తీరంలో ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తుంగభద్ర పుష్కరాలను కరోనా నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 5 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలు జరుపుతామని వివరించారు. పుష్కరాల నేపధ్యంలో తుంగభద్ర నదీ తీర దేవాలయాలను సుందరీకరించడంతోపాటు భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు .  పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్  తప్పనిసరి అని.. కరోనా వ్యాప్తి నేపధ్యంలో పుష్కర ఘాట్లలో షవర్ బాత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.  భక్తులు మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించి పుష్కరాలకు హాజరు కావాలని కోరారు.