
హైదరాబాద్, ఘట్ కేసర్, వెలుగు: లంకె బిందెల దొంగలు అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొర్రెములలో శుక్రవారం జరిగిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విజయోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలిచ్చారని, వాటిని అమలు చేయకుండా రేవంత్రెడ్డి చేతులెత్తేశాడని విమర్శించారు. డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు రైతులకు ఏం సమాధానం చెబుతారన్నారు.
రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మహాలక్ష్మి పథకం కోసం ఆడబిడ్డలు, రూ.4 వేల పెన్షన్ కోసం వృద్ధులు ఎదురుచూస్తున్నారన్నారు. అధికారంలోకొస్తే లంకె బిందెలు కొల్లగొట్టి పంచుకుందామనుకున్న కాంగ్రెస్ నేతలకు అధికారం వచ్చాక ఏం చేయాలో తెల్వడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కృష్ణా, గోదావరి నధుల్లో తెలంగాణ వాటా తేల్చడంలో కేంద్రం విఫలమైనదన్నారు.
కృష్ణాపై పూర్తి హక్కులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డుకు అప్పగించి తెలంగాణ ప్రజల హక్కులను కేంద్రం హరించిందన్నారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలను వాచ్ మెన్ లా కాపాడుకుంటానని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెసోళ్లకు ప్రజల మధ్యకు వచ్చే ధైర్యం లేదన్నారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోండి
ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేలు చెల్లించాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల, ఆటోడ్రైవర్లకు గిరాకీ తగ్గిందని పేర్కొన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా స్పందించరా అని సీఎంను ప్రశ్నించారు. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగులబెట్టుకున్న ఘటనను కేటీఆర్ ఉదహరించారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.