దేన్నీ వదలరా : మందు డబ్బుల కోసం.. గొర్రెల దొంగతనం..

దేన్నీ వదలరా : మందు డబ్బుల కోసం.. గొర్రెల దొంగతనం..

కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు..ఆటో డ్రైవర్లు దొంగల అవతారమెత్తారు. బాలాపూర్ పరిధిలోని షాహిన్ నగర్కు చెందిన షేక్ ఇక్భాల్, జాఫర్, సయ్యద్ అహ్మద్, మహమ్మద్ గౌస్, పాతబస్తీకి చెందిన షేక్ అమీర్లు  ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎంత గొప్పవాడికైన..బుర్రలో దుర్భుద్ది వస్తే ఇక వాడిని ఎవరూ రక్షించలేరు. అలాగే వీరి దృష్టి దొంగతనాల వైపు మళ్లింది. మొదట్లో పార్క్ చేసిన వాహనాలలో  డీజిల్ దొంగిలించడం, ఇండ్లల్లో దొంగతనాలలో ప్రారంభించిన దొంగల చివరకు మూగ జీవాలను కూడా వదలిపెట్టలేదు. దీని ఫలితంగా వారు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

48 గొర్రెలు, రూ. 2.50 లక్షలు, 4 ఫోన్లు స్వాధీనం

బడా కేటుగాళ్లు పథకం ప్రకారం ఉప్పల్ సమీపంలోని చిలుకా నగర్ లో ఓ కారును దొంగిలించారు. ఆ తరువాత పలు ప్రాంతాల్లో గొర్రెలను అపహరించారు.  ఐదుగురు సభ్యుల ముఠాలో  షేక్ ఇక్భాల్, జాఫర్, సయ్యద్ అహ్మద్, మహమ్మద్ గౌస్ని అదుపులోకి తీసుకోగా పాతబస్తీకి చెందిన షేక్ అమీర్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 2లక్షల 50వేల నగదు, 48 గొర్రెలు, మేకలు, ఒక ఇండికా కారు,4 ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించారు. 

వివరాల్లోకి వెళ్తే..

ఎంత సంపాదించిన.. తాగుడుకు బానిసైతే కొండలు కూడా కరిగిపోతాయన్న చందంగా.. వారి అవసరాలకు డబ్బు సరిపోకపోవడంతో.. ఎక్కడ ఏది దొరికితే దానిని తస్కరించారు.  తాజాగా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వండర్లా సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న దొంగల ముఠాపై నిఘా ఉంచారు.  అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని తమస్టైల్లో పోలీసులు విచారించారు.  ఇంకేముంది.. నిజమంతా పోలీసుల ముందు వెళ్లగక్కారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో  10 చోట్ల దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.  ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించారని  ఆదిభట్ల ఇన్స్పెక్టర్ టీ.రవికుమార్ తెలిపారు. ఈ కేసు చేధించడానికి  చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై డీ. సురేష్ కుమార్ బృందానికి రివార్డు అందజేశారు.