
- నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ
హైదరాబాద్, వెలుగు : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడు నొస్సామ్ మహ్మద్ యూనస్‌పై నాంపల్లిలోని ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టులో గురువారం చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 16 మంది నిందితులపై రెండు చార్జ్ షీట్స్ ఫైల్ చేసింది. ఓ వర్గం యువత ఉగ్రవాదం వైపు ప్రేరేపితం చెందేలా యూనస్ ట్రైనింగ్ ఇచ్చాడని చార్జ్ షీట్ లో ఎన్ఐఏ పేర్కొంది. దేశవ్యాప్తంగా టెర్రర్ దాడులకు కుట్ర చేశాడని తెలిపింది.
రిక్రూట్‌మెంట్‌తో పాటు ట్రైనింగ్‌కు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. కాగా, రాష్ట్రంలో పీఎఫ్ఐ సంస్థ ఓ వర్గం యువతను రిక్రూట్ చేసుకుని, ఉగ్రవాద శిక్షణనిచ్చిందనే ఆరోపణలతో నిజామాబాద్ లో గతేడాది జులైలో కేసు నమోదైంది. దీని ఆధారంగా అదే ఏడాది ఆగస్టులో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ.. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరిపింది. 20 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో 11 మందిపై మొదటి చార్జ్‌షీట్, ఈ ఏడాది మార్చిలో మరో ఐదుగురిపై సెకండ్ చార్జ్ షీట్ దాఖలు చేసింది.