బోథ్​మండలం సోనాలలో మూడో రోజు ఆందోళన

బోథ్​మండలం సోనాలలో మూడో రోజు ఆందోళన

బోథ్, వెలుగు: గ్రామాన్ని మండలం చేస్తామని మాట ఇచ్చి తప్పారంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్​జిల్లా బోథ్​మండలం సోనాలలో మూడో రోజు ఆందోళన కొనసాగించారు. బుధవారం అఖిలపక్షం, 12 గ్రామ పంచాయతీల ప్రజల ఆధ్వర్యంలో సోనాల అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఆందోళన నిర్వహించడంతో రహదారిపై ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. సోనాలను మండలం చేసేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వచ్చినపుడు గెలిచిన నెల రోజుల్లో సోనాలను మండలం చేస్తామని ప్రకటించారని, కానీ గెలిచి మూడేళ్లు గడిచినా మండలం ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రహదారిపై సామూహిక భోజనాలు చేశారు. ఎమ్మెల్యే ఉద్యమంలో పాల్గొని మండల సాధనకు కృషి చేయాలని కోరారు.

టీఆర్ఎస్​కు సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా 

ములుగు: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా చేయాలని టీఆర్ఎస్​పార్టీకి చెందిన పలువురు నాయకులు డిమాండ్​చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి మల్లంపల్లిని మండలం చేస్తామని మాట ఇచ్చారని చెప్పారు. అయితే ఇటీవల ప్రకటించిన మండలాల జాబితాలో మల్లంపల్లి లేకపోవడంతో సర్పంచ్ చందా కుమారస్వామి, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, టీఆర్ఎస్​ జిల్లా నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం శ్రీనగర్​వాసులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్​తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, వెంటనే మల్లంపల్లిని మండలం చేయాలని డిమాండ్​ చేశారు. మల్లంపల్లిని మండలం చేయాలని కోరుతూ మంగళవారం ముగ్గురు యువకులు పెట్రోల్​ పోసుకొని నిరసన తెలియజేయగా బుధవారం నుంచి రిలే దీక్షలు ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే మండలాన్ని ప్రకటించాలని, అప్పటివరకు దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తామని మండల సాధన నాయకులు చెప్పారు. 

గర్రెపల్లి కోసం ఒక్కటైన 9 గ్రామాలు

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని చుట్టుపక్కల 9 గ్రామాల ప్రజలు ఒక్కటయ్యారు. ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు సర్పంచులు, నాయకులు కొత్త మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే మండలం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణకు లెటర్ ​రాశారు.

గుంజపడుగను మండలం చేయాలె

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ కేంద్రంగా కొత్త మండలాన్ని చేయాలని  గుంజపడుగ, పరిసర గ్రామస్తులు బుధవారం మంథని, -గోదావరిఖని  ప్రధాన రహదారిపై  ధర్నా చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు సహకరించాలని గ్రామస్తులు కోరారు.