ప్రకృతితో కలసి జీవించడమంటే ఇదే.. అన్నీ సొంతంగా చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్న కేరళవాసి

ప్రకృతితో కలసి జీవించడమంటే ఇదే.. అన్నీ సొంతంగా చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్న కేరళవాసి

మనకు కావాల్సిన బియ్యం, పప్పులు, కూరగాయలు మనమే పండించుకుంటే ఎట్లుంటది? మనం తొడుక్కునే బట్టలు మనమే తయారు చేసుకుంటే ఎట్లుంటది? మనం ఉండే ఇల్లు మేస్త్రీలు,  కూలీలు లేకుండా మనమే కట్టుకుంటే ఎట్లుంటది? మన బర్రెలు, గొర్రెలు మనమే మేపుకుంటే ఎట్లుంటది? ఇయన్నీ చేసి చూపిస్తున్నడు కేరళ రైతు అంబ్రోజ్​.

కేరళలోని ష్రోనూర్‌‌‌‌కు చెందిన అంబ్రోజ్‌‌కు నేచురల్‌‌ లైఫ్‌‌ లీడ్‌‌ చేయడం ఇష్టం. చిన్నప్పట్నుంచి ఎక్కువగా ప్రకృతితో గడిపేందుకు ఇష్టపడేవాడు. ఇదే ఆలోచనతో స్థానికంగా ‘స్వశ్రయ వైపిన్‌‌’ పేరుతో కొన్నేళ్లకింద ఒక గాంధీ ఉద్యమం ప్రారంభమైంది. మనిషి స్వశక్తిపైనే ఆధారపడి, ప్రకృతికి దగ్గరగా గడపడం ఈ ఉద్యమ లక్ష్యం. దీనిలో పాతికేళ్ల క్రితం అంబ్రోజ్‌‌ పార్టిసిపేట్‌‌ చేసి, ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ గురించి తెలుసుకుని, ఫాలో అవ్వడం స్టార్ట్‌‌ చేశాడు. ఆ తర్వాత మెల్లిగా ఇతర పద్ధతుల్ని తెలుసుకున్నాడు. వాటిని ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నాడు.

అన్నీ నేచురల్‌‌ ప్రొడక్ట్స్‌‌తోనే

ఎరువులు వాడకుండా పంటలు పండించడం, మట్టితో కుండలు తయారు చేయడం, రాట్నం వడికి కాటన్‌‌ బట్టలు తయారు చేయడం, వాటికి నేచురల్‌‌ రంగులద్దడం, మట్టి, కలప, సున్నపురాయి వంటి వాటితోనే ఇల్లు కట్టుకోవడం.. ఇలాంటివన్నీ తనకున్న వ్యవసాయ క్షేత్రంలోనే ‘ఫార్మర్స్‌‌ షేర్‌‌‌‌’ పేరుతో చేస్తున్నాడు అంబ్రోజ్‌‌. నీలా నది ఒడ్డున, పది ఎకరాల్లో ‘ఫార్మర్స్‌‌ షేర్‌‌‌‌’ క్యాంపస్‌‌ విస్తరించి ఉంది. ఇందులోనే ఆయన భార్య మినీ ఎలిజబెత్‌‌తోపాటు కొడుకులు అమాల్‌‌, అఖిల్‌‌ కూడా పని చేస్తుంటారు. పంటలు పండించడం, పూలు, ఆయుర్వేద మొక్కలు పెంచడం, యానిమల్‌‌ ఫార్మింగ్‌‌, తేనె సేకరణ వంటివన్నీ ఇక్కడ చేస్తుంటారు. ఇక్కడి ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌‌ కూడా చేస్తున్నారు. ఏ అవసరం కోసం బయటివాటిపై ఆధారపడకూడదనేది అంబ్రోజ్‌‌ సిద్ధాంతం.

ట్రైనింగ్‌‌ కూడా

ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా, యంగ్‌‌ జనరేషన్‌‌ మాత్రం దీనికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అందుకే వాళ్లకు కూడా ట్రైనింగ్‌‌ ఇచ్చి ఇలాంటి లైఫ్‌‌స్టైల్‌‌ను పరిచయం చేయాలని ‘ఫార్మర్స్ షేర్‌‌‌‌’ను స్టార్ట్‌‌ చేశాడు అంబ్రోజ్‌‌. ఇక్కడకొచ్చిన వాళ్లు రాట్నం, మగ్గంలతో బట్టలు తయారు చేయడం, వాటికి సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులద్దడం, ఆ రంగులు తయారు చేయడం, మట్టి పాత్రలు చేయడం, ఇల్లు కట్టుకోవడం, తేనె సేకరణ, క్రాఫ్ట్స్‌‌, చేపల పెంపకం, యానిమల్‌‌ ఫార్మింగ్‌‌ వంటివన్నీ నేర్పిస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు.

సొంతంగా టీపొడి

మార్కెట్లో దొరికే రకరకాల టీ పొడులు తెచ్చుకుని టీ చేసుకుంటారు ఎవరైనా. కానీ, ‘ఫార్మర్స్‌‌ షేర్‌‌‌‌’లో మాత్రం మందార, తులసి వంటి మొక్కలతో టీ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. అలాగే కూరగాయలు, పండ్లు వంటివి వేస్ట్‌‌ కాకుండా, ఎలా వాడుకోవచ్చో చూపిస్తారు. టొమాటో, ఉల్లిగడ్డ, ఆకు కూరలు వంటి వాటిని ఎండబెట్టి, పొడి చేసుకుని అన్‌‌ సీజన్‌‌లో వాడుకోవడం ఎలాగో నేర్పిస్తారు. ప్రకృతిలో దొరికే ఏ ఒక్క పదార్థాన్ని వేస్ట్‌‌ చేయకుండా వాడుకోవచ్చని ప్రాక్టికల్‌‌గా నిరూపిస్తోంది ‘ఫార్మర్స్‌‌ లైఫ్‌‌’.

ప్రతి జీవికి హక్కు

ప్రతిజీవికి మనిషితోపాటు అన్ని వనరుల్ని సమానంగా పొందే హక్కు ఉంది అంటాడు అంబ్రోజ్‌‌. ఇక్కడ పండే పండ్లు, కూరగాయల్ని ఉడుతలు, చిలుకలు, ఇతర పక్షులు తిన్నా అంబ్రోజ్‌‌ వాటిని వెళ్లగొట్టడు. వాటికీ సమాన హక్కు ఉందంటాడు. పూలను సాయంత్రం పూటే కోస్తాడు. ఎందుకంటే రోజంతా తేనెటీగలు వాటిలోని మకరందాన్ని తాగుతాయి. అందువల్ల వాటికోసం పూలను కూడా సాయంత్రం వరకు కోయకుండా ఉంటారు. ఇలా ప్రతి జీవికి తమ వాటా ఇవ్వాలని చెప్తున్నాడు అంబ్రోజ్‌‌.

సొంత వనరులతోనే లైఫ్‌‌

‘‘లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో అందరూ తమ వనరుల్ని తక్కువగా వాడుకున్నారు. మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్‌‌ అందుబాటులో లేకుండా పోయాయి. ఆ టైమ్‌‌లో ఉన్నవాటితోనే సర్దుకున్నాం. స్థానికంగా దొరికేవాటిపైనే ఆధారపడ్డాం. అందుకే ఎప్పుడూ ఇతరులపై ఆధారపడకుండా, సొంత వనరుల్ని వాడుకోవడంపై దృష్టి పెడితే ఈ సమస్య రాదు. మనకు కావాల్సినవన్నీ మనమే సమకూర్చుకోగల శక్తి మనకు ఉందని నా లైఫ్‌‌ ద్వారా చెప్పాలి అనుకుంటున్నా” అన్నాడు అంబ్రోజ్‌‌.