V6 News

బుమ్రా బౌలింగ్ అద్భుతం.. అక్తర్ ప్రశంసలు

బుమ్రా బౌలింగ్ అద్భుతం.. అక్తర్ ప్రశంసలు
టీమిండియా గెలుపోటముల్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలకంగా మారాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, నిలకడైన వేగం, దూకుడుగా సంధించే బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బుమ్రా టీమ్‌‌కు ప్రధాన బలంగా మారాడు. షమి, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, జడేజాలతో కలసి ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థుల పని పడుతున్నాడు. అలాంటి బుమ్రా బౌలింగ్‌‌ను ఇప్పటికే చాలా మంది వెటరన్ క్రికెటర్లు ప్రశంసించారు. తాజాగా బుమ్రా బౌలింగ్ పై రావల్పిండి ఎక్స్‌‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. బుమ్రా బౌలింగ్ ఒకప్పటి పాక్ బౌలర్ల దూకుడు, టెక్నిక్‌‌కు అద్దం పడుతోందన్నాడు. ‘గాలి వేగాన్ని, వీచే దిశను బట్టి బౌలింగ్‌‌ చేస్తున్న భారత తొలి పేసర్ బుమ్రానే కావొచ్చు. పిచ్ మీద పచ్చిక ఉందా లేదా అనేది పట్టించుకోకుండా అతడు బౌలింగ్ చేస్తున్నాడు. ఈ కళను ఒకప్పుడు పాక్ బౌలర్లు యత్నించేవారు. గాలి వేగం, వీచే దిశను బట్టి వసీం అక్రమ్, వకార్ యూనిస్‌‌తోపాటు నేను బౌలింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు బుమ్రా అదే చేస్తున్నాడు. అతడో అసాధారణ బౌలర్. ఫిట్‌‌గా ఉండి, వెన్నెముక సహకరిస్తే అతడు గొప్ప బౌలర్ అవుతాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌‌ను విమర్శించే వారిని పెర్ఫామెన్స్‌‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఒకే చోట నిలకడగా 60 బంతులు వేయగల సత్తా అతడికి ఉంది. బుమ్రా క్రీజును వాడుకునే విధానం, వేరియేషన్స్, స్వింగ్ చేసే పద్ధతి అన్నీ అద్భుతమనే చెప్పాలి’ అని అక్తర్ పేర్కొన్నాడు.