ఈ ఏడాది సొంత వర్గం నుంచే సర్కార్​కు వ్యతిరేకత

ఈ ఏడాది సొంత వర్గం నుంచే సర్కార్​కు వ్యతిరేకత
  •     రాష్ట్రంలో రాజకీయ ఒడిదొడుకులు ఉంటయ్
  •     పంచాంగ పఠనంలో బాచంపల్లి సంతోష్ 

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది సొంత వర్గం నుంచే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వేద పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్​ది కర్కాటక రాశి. ఆయనకు ఏప్రిల్​22 నుంచి పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. కొన్ని వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అన్ని విషయాల మీద అవగాహనతో ముందుకు వెళ్లాలి” అని సూచించారు. బుధవారం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంతోష్​ కుమార్ పంచాంగ పఠనం చేశారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో రాష్ట్ర రాజకీయాల్లో  ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయని ఆయన చెప్పారు. రాజకీయ ఒడిదొడుకులు ఉంటాయని తెలిపారు. ఏప్రిల్, మేలో విపరీతమైన ఎండలు ఉంటాయని.. ఆగస్టు, సెప్టెంబర్ లో మస్తు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్​15 వరకు తుఫాన్ల కాలం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విందులు, వినోదాలు బాగా జరుగుతాయని పేర్కొన్నారు. మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

జాబ్స్ రిక్రూట్మెంట్​లో జాగ్రత్తలు తీసుకోవాలి.. 

ఉద్యోగ నియామకాల్లో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సంతోష్ కుమార్ సూచించారు. ఈసారి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయని తెలిపారు. పంటలు బాగా పండుతాయని, పాడి పరిశ్రమ బాగుంటుందని చెప్పారు. అయితే ఆహార పదార్థాలు, పాలల్లో కల్తీ పెరుగుతోందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమూల మార్పులు తీసుకురానున్నాయని.. అక్కడక్కడ కొన్ని అవకతవకలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈసారి రాష్ట్రంలో యజ్ఞాలు, యాగాలు మస్తుగా చేస్తారని తెలిపారు. విద్యార్థులకు చదువు, పరిశోధనల పరంగా మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య శత్రుత్వ భావన తగ్గి, స్నేహభావం పెరుగుతుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ ఏడాది మహిళల ఆధిపత్యం పెరుగుతుంది. వాళ్లు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు’’ అని చెప్పారు. ‘‘ఈసారి కోర్టులు గొప్ప జడ్జిమెంట్లు ఇస్తాయి. మీడియాకు మస్తు వార్తలు ఉంటాయి. సినిమా రంగం మరోసారి సత్తా చాటుతుంది” అని తెలిపారు.