
కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ అద్దె భవనాల్లోనే కలెక్టర్ ఆఫీసులు
ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక లేటవుతున్న నిర్మాణాలు
ఏటా పెరుగుతున్న అంచనా వ్యయం
నెలనెలా రెంట్ల రూపంలో మరింత బర్డెన్
(వెలుగు, నెట్వర్క్): హైదరాబాద్‌లో అన్నివిధాలా బాగున్న సెక్రెటేరియెట్ బిల్డింగులను కూల్చి, కొత్త భవనం కట్టేందుకు రూ.500 కోట్లతో హడావిడిగా టెండర్లు పిలుస్తున్న రాష్ట్ర సర్కారు, నాలుగేళ్ల క్రితం ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో మాత్రం నేటికీ కలెక్టరేట్లను పూర్తిచేయలేకపోయింది. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు అందక నిర్మాణాలు ఏండ్లకేండ్లు లేటవుతున్నాయి. పెరుగుతున్న అంచనా వ్యయంతో ఖర్చు రెండింతలవుతుండగా, ఆఫీసుల కోసం తీసుకున్న ప్రైవేట్ బిల్డింగులకు ప్రతి నెలా రెంట్ల రూపంలో లక్షలకు లక్షలు కట్టాల్సి వస్తోంది.
మూడేండ్ల క్రితం శంకుస్థాపన..
రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్11న 21 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. 17 ఫిబ్రవరి 2019 నుంచి ములుగు, నారాయణపేట కేంద్రంగా మరో రెండు జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నట్లు అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. వివిధ పనుల కోసం జిల్లాకేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తామని చెప్పారు. 2017 అక్టోబర్ 12న మెజారిటీ జిల్లాల్లో ఆర్భాటంగా శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా కలెక్టరేట్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. వీటితో పాటు నిర్మిస్తున్న ఎస్పీ ఆఫీసులదీ ఇదే తీరు. సర్కారు నుంచి సకాలంలో బిల్లులు రాకపోవడంతో గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా చాలా జిల్లాల్లో అంచనా వ్యయం కోట్లకు కోట్లు పెరిగిపోతోంది. మరోవైపు కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రైవేట్ బిల్డింగుల్లో నడుస్తున్న ఆఫీసుల్లో స్టాఫ్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడో విసేరిసినట్లున్న ఆఫీసుల కారణంగా ప్రజలకు సైతం తిప్పలు తప్పడం లేదు.
పెరుగుతున్న అంచనా వ్యయం..
సర్కారు నుంచి టైంకు బిల్లులు రాకపోవడంతో కలెక్టరేట్ల నిర్మాణం లేటవుతోంది. ఫలితంగా అంచనా వ్యయం పెరిగిపోతోంది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌కు 2016 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. మొదట రూ. 32కోట్ల అంచనాతో నిర్మాణం ప్రారంభించగా, పనులు లేట్కావడంతో ఇప్పుడది రూ. 47.50 కోట్లకు చేరింది. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 15.5 కోట్లు పెరిగింది. సూర్యాపేట జిల్లాలో రూ.25 కోట్ల అంచనాతో కలెక్టరేట్, రూ.15 కోట్ల అంచనాతో ఎస్పీ ఆఫీసులకు 2017 అక్టోబర్ 12న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌తో ఒప్పందం ప్రకారం రెండేళ్లలో పూర్తికావాల్సి ఉన్నా సర్కారు నుంచి బిల్లులు రాక పనులు లేటయ్యాయి. దీంతో కలెక్టరేట్ అంచనా వ్యయం రూ. 49.02కోట్లకు చేరింది. ఇప్పటివరకు కలెక్టరేట్‌కు రూ.8.5 కోట్లు, ఎస్పీ ఆఫీస్‌కు రూ.3.5 కోట్లు మాత్రమే విడుదల కావడంతో కేవలం 40శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కలెక్టరేట్ ఆఫీస్‌ను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బిల్డింగ్ లో నిర్వహిస్తుండగా, ప్రతి నెలా రూ.4.3లక్షల అద్దె కడుతున్నారు. యాదాద్రి కలెక్టరేట్ కూడా భువనగిరి శివారులోని పగిడిపల్లి వద్ద ప్రైవేట్ బిల్డింగ్‌లో నడుపుతుండగా, దీనికి సైతం ప్రతి నెల రూ. 4.50 లక్షల రెంట్ కడుతున్నారు. మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను రూ.48.62 కోట్లతో రెండు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు పనులు 50శాతం కూడా కాలేదు. 2016 నుంచి కలెక్టరేట్ ప్రైవేట్ బిల్డింగ్లోనడుస్తుండగా, ప్రతి నెలా రూ.5.50 లక్షల రెంట్ కట్టాల్సి వస్తోంది. ఎస్పీ ఆఫీసు పనులు పిల్లర్ల దగ్గరే ఆగిపోగా, దీనికి మరో రూ.75 వేల రెంట్ చెల్లిస్తున్నారు. వనపర్తిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు 2016 ఆగస్టులో రూ.40కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. 80శాతం పనులు పూర్తయ్యేసరికి ప్రభుత్వం ఇచ్చిన రూ.40 కోట్లు ఖర్చయ్యాయి. ఇంకా రూ. 15 కోట్లు అవసరమని ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపారు. ఇలా పనులు లేట్కావడం వల్ల ఆయా కలెక్టరేట్ల అంచనా వ్యయం అంతకంతకూ పెరిగిపోయింది.
ఈ జిల్లాల్లో వెరీ స్లో..
కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లకు కేటాయించిన లాండ్ బాగాలేకపోవడం, వివాదాల్లో ఉండడం వల్ల కొన్నిచోట్ల నిర్మాణాలు లేటవుతున్నాయి. నిర్మల్ కలెక్టరేట్‌కు కేటాయించిన స్థలంలో గుట్టలు ఉండటం వల్ల వాటిని తొలగించేందుకే 9 నెలలు పట్టింది. ఆ తర్వాత నిర్మాణం పక్కనే ఉన్న చెరువుకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 2018 సెప్టెంబర్‌లో రూ.40కోట్ల అంచనా వ్యయంతో పనులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు రూ. 10 కోట్ల విలువైన వర్క్స్ చేయగా, ఇందులో రూ.2 కోట్ల వరకు కాంట్రాక్టర్‌కు బకాయిలున్నాయి. దీంతో కేవలం 20 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ జిల్లాలో ఎస్పీ ఆఫీస్ నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. మంచిర్యాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు నస్పూర్ శివారులో 22.5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించగా, అందులో తమ సొంత భూములున్నాయని కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో పనులను ఆలస్యంగా మొదలుపెట్టారు. రూ.33.34 కోట్లతో చేపట్టగా, ఇప్పటివరకు కేవలం 30 శాతం మాత్రం పనులే జరిగాయి. దీంతో బీసీ ఉమెన్స్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బిల్డింగ్‌లో కలెక్టరేట్ నడుపుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో రూ.25 కోట్లతో కొత్త కలెక్టరేట్, రూ.15 కోట్లతో ఎస్పీ భవన నిర్మాణ పనులకు 2018 జనవరి నెలలో అప్పటి శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. రెండేళ్లవుతున్నా పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. క్వాలిటీ లేకపోవడంవల్ల ఎస్పీ బిల్డింగ్ స్లాబ్ మొత్తం ఓసారి కూలిపోయి, పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం సింగరేణి భవనాల్లో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సాలార్ తండా దగ్గర కలెక్టరేట్‌కు 2018 ఏప్రిల్4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా, తమ భూమిలో బిల్డింగ్ కట్టొద్దని గిరిజనులు ఆందోళనకు దిగడంతో ఆలస్యంగా పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం కలెక్టరేట్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినా, రూ. 15 కోట్లతో చేస్తున్న ఎస్పీ ఆఫీసు మాత్రం ఇంకా పిల్లర్ల దశలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులను 2018 ఫిబ్రవరిలో రూ. 48 కోట్లతో ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.18 కోట్లు ఖర్చు పెట్టగా ఏడాదిగా బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయలేనని చేతులెత్తేశాడు. ఇప్పటివరకు కేవలం 60 శాతం మాత్రమే పనులు జరిగాయి. గోదావరిఖని, జగిత్యాలలోని ఎస్పీ ఆఫీసు పనులు ఫిల్లర్లు, స్లాబు దశలోనే ఆగిపోగా, జగిత్యాల ఆఫీసు మేకలు, గొర్లకు దొడ్డిగా మారింది.
ఇక్కడ ఇంకా క్లారిటీ రాలే..
పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణంపై ఇంకా క్లారిటీ రాలేదు. వరంగల్‍రూరల్ జిల్లా ఏర్పడి నాలుగేళ్లవుతున్నా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఎక్కడ కట్టాలనేదానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేదు. దీంతో రూరల్ కలెక్టరేట్ మొదలు డిపార్టుమెంట్లన్నీ అర్బన్‍లోనే ఉన్నాయి. 35 వరకు మెయిన్ డిపార్టుమెంట్లు 70 శాతం కిరాయి ఇండ్లల్లోనే ఉన్నాయి. వీటికి అద్దె రూపంలో ప్రతి నెలా రూ.12 లక్షల నుంచి 14 లక్షల చొప్పున గడిచిన నాలుగేళ్లలో దాదాపు రూ.6 కోట్లకు పైగా చెల్లించారు. ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పడి ఏడాదిన్నర గడిచినప్పటికీ నూతన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను ఇంకా మంజూరుచేయలేదు. దీంతో స్థల పరిశీలన జరగలేదు. నారాయణపేట జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల భవనంలో కలెక్టరేట్ నిర్వహిస్తుండగా, ములుగు జిల్లాలో ఆఫీసులన్నీ చెట్టుకొకటి, పుట్టకొకటి అన్నట్లుగా నడుస్తున్నాయి.
ఈ జిల్లాల్లో మరో ఐదారు నెలలు ఆగాల్సిందే..
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి జిల్లాలతో పాటు యాదాద్రి, జగిత్యాల, గద్వాల, కామారెడ్డి, జనగామలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు పూర్తికావచ్చాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో కామారెడ్డి కలెక్టరేట్ పనులు 80శాతం వరకు పూర్తయ్యాయి. ఇంటర్నల్ రోడ్స్, కాంపౌండ్ వాల్స్, ఎలక్ట్రికల్ లాంటి వర్క్స్ మిగిలి ఉన్నాయి. సకాలంలో ఫండ్స్ రాకపోవడం, లేబర్ కొరత కారణంగా ఈ పనులు పూర్తవడానికి ఐదారు నెలలు పట్టవచ్చని అంటున్నారు. ఈ ఏడాది ఇంకా 3 నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ జిల్లాల్లోనూ కలెక్టరేట్లు వచ్చే ఏడాదే అందుబాటులోకి వస్తాయని అప్పటిదాకా రెంట్ల బాధ తప్పదంటున్నారు.
కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో కలెక్టర్, ఎస్పీ భవనాల ఊసే లేదు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ బిల్డింగ్ నిర్మాణం పై సర్కార్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మంజూరే లేకపోవడంతో స్థల పరిశీలన కూడా జరగలేదు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాల భవనంలో కలెక్టరేట్ నిర్వహిస్తుండగా, దీనికి 1.20 లక్షలు, ఇతర బిల్డింగులకు రూ.80వేల చొప్పున మొత్తం 2లక్షల అద్దె చెల్లిస్తున్నారు.
గద్వాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు 2018 జనవరిలో శంకుస్థాపన చేశారు. రెండున్నరేండ్లు దాటినా ఇంకా 70శాతం పనులే పూర్తయ్యాయి. సర్కారు నుంచి సకాలంలో ఫండ్స్ రాక పనులు లేట్ అవుతున్నాయని, తమకు ఇంకా రూ.10 కోట్లు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ప్రస్తుతం బీజేపీపాత ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్ నడుపుతున్నారు.