శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రారంభం కాని ఆ రెండు యూనిట్లు

 శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రారంభం కాని ఆ రెండు యూనిట్లు
  • అగ్ని ప్రమాదంతో భారీగా తగ్గిన ఉత్పత్తి.. ఇప్పటిదాకా 480 ఎంయూలే
  • ఇప్పటికీ రిపోర్ట్ రాలేదు..అంతా సీక్రెట్  

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 7 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా అందుబాటులోకి రాలేదు. మార్చి నాటికి ప్లాంటును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని అప్పట్లో సర్కారు ప్రకటనలు చేసింది. కానీ ఇంకా నెలల తరబడి పనులు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 1, 2, 5, 6 యూనిట్ లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ప్రమాదంలో బాగా దెబ్బతిన్న 3, 4 యూనిట్ లలో కరెంట్ ఉత్పత్తి స్టార్ట్ కాలేదు. జనరేటర్ మోడ్, కండెన్సర్ మోడ్, పంప్ మోడ్ పనులు కొన్ని పూర్తి కాగా ఇంకొన్ని పనులు పూర్తి  చేయాల్సి ఉందని చెప్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 45 మిలియన్ యూనిట్(ఎంయూ)ల కరెంటు మాత్రమే ఉత్పత్తి జరిగింది. రెండురోజులుగా ఒక మిలియన్ యూనిట్ కూడా పూర్తిగా ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. 

480 ఎంయూలే ఉత్పత్తి  
2020–-21 ఫైనాన్షియల్ ఇయర్లో శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు ద్వారా మొత్తం1,146.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అయితే ప్రమాదం జరిగిన ఆగస్టు 20వ తేదీ నాటికే700 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత కరెంట్ తయారీపై భారీ ఎఫెక్ట్ పడింది. అప్పటి నుంచి 480 ఎంయూల కరెంట్ మాత్రమే ఉత్పత్తి అయినట్లు జెన్ కో లెక్కలు చెప్తున్నాయి.

80 శాతం శ్రీశైలం నుంచే 
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో యావరేజ్ గా రోజూ 21.6 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా జెన్ కోకు రోజూ రూ. 15 కోట్ల ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే హైడల్ పవర్ లో 80శాతం ఇక్కడే తయారవుతుంది. కానీ ప్రమాదం కారణంగా ఉత్పత్తిపై భారీగా ఎఫెక్ట్ పడటంతో ఆమేరకు ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఆరు యూనిట్లు ఉన్న శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ900 మెగావాట్లు. ఏటా సీజన్లో నాలుగు నెలల పాటు కరెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎండాకాలంలోనూ రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా కరెంట్ ను తయారు చేసేందుకు వీలుంది. ప్లాంటులో ప్రమాదం కారణంగా దాదాపు రూ. 2 వేల కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికీ నో రిపోర్ట్ 
శ్రీశైలం పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగి 9 మంది చనిపోయారు. సంస్థకు భారీ నష్టం జరిగింది. ప్రమాదం జరిగి 7 నెలలైనా, ఇప్పటివరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. జెన్ కో సీఎండీ ఆధ్వర్యంలో ఎక్స్ పర్ట్ కమిటీని వేసి15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది. ఈ ఘటనపై ఇప్పటివరకూ రిపోర్ట్ రాకపోవడం చూస్తే.. విద్యుత్ సంస్థల్లో అంతా సీక్రెట్ గా ఉంచుతున్న తీరును స్పష్టం చేస్తోంది.