భారత్ నుంచి పాక్‌కి ముప్పు పెరుగుతుంది

భారత్ నుంచి పాక్‌కి ముప్పు పెరుగుతుంది

CAAపై ప్రజల దృష్టి మరల్చడానికి ఇండియన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తప్పుబట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల కారణంగా భారతదేశం నుండి పాకిస్తాన్‌కు ముప్పు పెరుగుతోందని ఆ దేశాధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. న్యూఢిల్లీ పెద్దలు ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా దానికి తగిన విధంగా తమ దేశం స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితి మరింత దిగజారిపోతుందని, దానిపై చర్య తీసుకోవడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం ప్రకటన చేశారు. ఆ ప్రకటన పాకిస్తాన్‌ను మరింత ఆందోళనకు గురిచేసిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో CAAకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లను దృష్టి మరల్చడానికి చేసినట్లుగా ఉందని ఆయన అన్నారు.

‘CAAకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నందున, భారతదేశం నుండి పాక్‌కు కూడా ముప్పు పెరుగుతోంది. భారత ఆర్మీ చీఫ్ యొక్క ప్రకటన మా ఆందోళనలను మరింత పెంచుతుంది. నేను గత కొంతకాలంగా భారత్‌ను హెచ్చరిస్తూనే ఉన్నాను, అయినా మళ్ళీ పునరుద్ఘాటించి చెప్తున్నాను. హిందూ జాతీయవాదాన్ని పెంచుకోవడం కోసం మరియు భారత్‌లో జరుగుతున్న నిరసనల దృష్టి మరల్చటానికి ఇటువంటి చర్యలకు పాల్పడితే పాకిస్థాన్‌కు కూడా వేరే మార్గం లేదు. మేం కూడా వారి చర్యకు ప్రతిచర్యగా స్పందించక తప్పదు’ అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.