
హైదరాబాద్: ఔరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ రైలుకు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, రైల్వే పోలీసులు ఘట్ కేసర్ రైల్వేస్టేషన్లో రైలును ఆపి తనిఖీలు చేపట్టారు. ఘట్కేసర్ లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు దాదాపు గంట నుంచి రైలును జల్లెడ పడుతున్నారు.
అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం తెలియడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు గంట నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ట్రైన్లో తనిఖీలు చేస్తూనే.. మరోవైపు కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దసరా పండగ వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్నారని కాల్ రావడంతో తెలంగాణ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.