కువైట్‌‌ నుంచి రాజాసింగ్‌‌కు బెదిరింపు కాల్స్

కువైట్‌‌ నుంచి రాజాసింగ్‌‌కు బెదిరింపు కాల్స్
  • నిందితుడిని గుర్తించిన పోలీసులు
  • చాంద్రాయణగుట్టకు చెందిన  మహ్మద్ ఖాసీంపై లుక్‌‌ ఔట్ నోటీసులు
  • ఇలా పోలీసులు ఎన్నడూ స్పందించలేదన్న రాజాసింగ్‌‌  

హైదరాబాద్‌‌,వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు బెదిరింపుల కేసులో కువైట్‌‌ నుంచి కాల్స్‌‌ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ ఖాసింగా ఆధారాలు సేకరించారు. 14 ఏండ్ల కిందట ఖాసిం దుబాయ్‌‌ వెళ్లి.. అటు నుంచి కువైట్‌‌కు వెళ్లి అక్కడ సెటిల్‌‌ అయ్యాడు. రాజాసింగ్ తో సహా హిందుత్వవాదులపై ద్వేషంతో అతడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండేవాడు. వాయిస్‌‌ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటో కాల్(వీఓఐపీ) నంబర్లతో ఇండియాకు కాల్స్ చేస్తుండేవాడు. రాజాసింగ్‌‌తో సహా మరికొందరికి బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తే  తన కొడుకుని కిడ్నాప్ చేసి తనను షూట్‌‌ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని డీజీపీ రవిగుప్తాకు ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ ఫిర్యాదు చేసినది తెలిసిందే. 7199942827,4223532270 తో పాటు  మరి కొన్ని నంబర్లతో కాల్స్‌‌ వచ్చినట్లు ఆయన మంగళవారం ఫిర్యాదు చేశాడు.

గత ఆదివారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు వచ్చిన దాదాపు 20 బెదిరింపు కాల్స్ వివరాలను అందించాడు. డీజీపీ ఆదేశాలతో పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.  కువైట్‌‌ నుంచి కాల్స్ వస్తున్నట్లు గుర్తించి  మహ్మద్ ఖాసింపై లుక్‌‌ ఔట్‌‌ నోటీసులు జారీ చేశారు. అతడు ఇండియాకు రాగానే అరెస్ట్‌‌ చేసే చాన్స్ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పందించిన పోలీసులకు రాజాసింగ్‌‌ కృతజ్ఞతలు తెలిపాడు. తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని గుర్తించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. వీడియో విడుదల చేశాడు. కార్పొరేటర్‌‌గా ఉన్నప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, పోలీసులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేసినట్టు రాజాసింగ్ గుర్తుచేశాడు.  కంప్లైంట్స్ పై  ఎఫ్ఐఆర్‌‌‌‌ చేసి తనకు తెలియకుండానే క్లోజ్ చేసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కంప్లయింట్ పై తొలిసారిగా పోలీసులు వేగం గా స్పందించారని, తొందరగా నిందితుడిని అరెస్ట్ చేయాలని పోలీసులను రాజాసింగ్ కోరాడు.