పగుడాకుల బాలస్వామికి బెదిరింపు కాల్స్

పగుడాకుల బాలస్వామికి బెదిరింపు కాల్స్

హైదరాబాద్, వెలుగు: బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాలు నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్తుకి ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దంటూ, సౌత్ జోన్ డీసీపీ, అదనపు డీసీపీలపై పదే పదే ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావంటూ పరుష పదజాలంతో తిట్టారన్నారు.

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన నిరసన కార్యక్రమాలు వెంటనే రద్దు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. తాను ఎక్కడ ఉంటానని, ఏం చేస్తుంటానని కూడా వారు తనను ప్రశ్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ విడుదల చేసిన ప్రెస్​నోట్​లో  వివాదాస్పద వ్యాఖ్యలు యాడ్ చేసి వైరల్ చేశారన్నారు. తనకు రక్షణ కల్పించాలంటూ డీసీపీని బాలస్వామి కోరారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.