ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్తగా 'ఈవీ పాలసీ 2026-2030' ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీ రాయితీలు ఇవ్వనుంది. ఇప్పుడు మీరు కొనే ఎలక్ట్రిక్ కార్ ధర రూ. 30 లక్షల లోపు ఉంటే, దానికి ఎలాంటి రోడ్ టాక్స్ (Road Tax), రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది మార్చి 31, 2030 వరకు వర్తిస్తుంది. పెట్రోల్, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ కార్లకు రోడ్ టాక్స్‌లో 50% రాయితీ ఉంటుంది. అయితే రూ. 30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ కార్లకు ఈ రాయితీలు వర్తించవు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బైక్ ధర రూ. 2.25 లక్షల లోపు ఉండాలి. వీటికి ఇచ్చే రాయితీ ఏటా తగ్గుతూ ఉంటుంది. మొదటి ఏడాది బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి గరిష్టంగా రూ. 30,000 వరకు రాయితీ ఇస్తుంది. రెండవ ఏడాది గరిష్టంగా రూ. 20,000 వరకు, మూడవ ఏడాది గరిష్టంగా రూ. 10,000 వరకు మాత్రమే... అంటే, త్వరగా కొన్నవారికే ఎక్కువ లాభం ఉంటుంది.
జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలనే అనుమతిస్తారు. ఎలక్ట్రిక్ ఆటోలు కొనేవారికి మొదటి ఏడాది రూ. 50,000 వరకు, ట్రక్కులు కొనేవారికి రూ. 1,00,000 వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.
Also Read : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు
ఇకపై స్కూల్ బస్సులు కూడా దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారాలని, 2030 నాటికి 30% స్కూల్ బస్సులు ఎలక్ట్రిక్ వి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం అద్దెకు తీసుకునే వాహనాలన్నీ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలి.
కొత్తగా కట్టే భవనాలు, అపార్ట్‌మెంట్‌లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు తప్పనిసరి చేసింది. ఇక సిటీ అంతటా బ్యాటరీ మార్పిడి కేంద్రాలు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించి, గాలి నాణ్యతను పెంచడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. డిజిటల్ పద్ధతిలోనే దరఖాస్తులు, రాయితీల చెల్లింపులు జరుగుతాయి కాబట్టి మధ్యవర్తుల బెడద ఉండదు.
