ప్రశ్నిస్తే బెదిరింపులు.. వినకుంటే బేడీలు

ప్రశ్నిస్తే బెదిరింపులు.. వినకుంటే బేడీలు
  • రాష్ట్రంలో నిరసన గళాలపై ఉక్కుపాదం

హైదరాబాద్, వెలుగు: నిర్బంధాలు లేని ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుందని ఆశపడ్డ ప్రజలకు ఏడేండ్లుగా నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనలు తెలిపే పరిస్థితి లేకుండాపోయింది. ఎవరైనా ధైర్యం చేసి తప్పులను ఎత్తి చూపితే.. వారిపై బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారింది. వినకపోతే కేసులు పెట్టి జైలుపాలు చేసిన సందర్భాలు అనేకం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేం పద్ధతంటూ ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాల నేతలు, అపోజిషన్ పార్టీల లీడర్లు మండిపడుతున్నారు.

కేసులు, జైళ్లు, నిర్బంధాలు
ఏడేండ్లలో రాష్ట్ర సర్కారు అనేక మందిపై తప్పుడు కేసులు బనాయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంత ప్రజలను ఓదార్చేందుకు ప్రతిపక్ష పార్టీల లీడర్లు, ప్రజా సంఘాల నాయకులు  వెళ్తుంటే వారిని అడ్డుకుని కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. పరిహారం కోసం రోడ్డెక్కిన బాధితులపైనా కేసులు పెట్టారు. ఖమ్మం జిల్లాలో మిర్చి కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపిన రైతులకు బేడీలు వేశారు. ఉద్యోగాల భర్తీ ఏమైందని అడిగిన స్టూడెంట్లపై కేసులు పెట్టి జైలుపాలు చేశారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

కోర్టు ఆదేశిస్తే తప్ప ధర్నా చౌక్  తెరువలే
నిరసన తెలిపే చాన్స్ లేకుండా హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను అప్పట్లో ప్రభుత్వం ఎత్తేసింది. సిటీకి అవతల ధర్నాలు చేసుకోవాలని చెప్పింది. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తే ఎలా అని హైకోర్టు చివాట్లు పెడ్తే తప్ప ధర్నా చౌక్​ను ప్రభుత్వం తిరిగి ఓపెన్ చేయలేదు.

సోషల్ మీడియాపై నిఘా
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తే సర్కారు సహించడం లేదు. పోస్టులు పెట్టిన వారిని గుర్తించి ముందుగా వారిని బెదిరిస్తున్నారు. అయినా మాట వినకపోతే  కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భాలూ ఉన్నాయి. టీఆర్​ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఎక్కువైంది. 

మీడియాపై ఆంక్షలు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు సొంత రాష్ట్రంలో అడుగడుగునా నిర్బంధాలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల వేదికలపై భాగస్వామ్యం పంచుకున్న టీఆర్ఎస్​ లీడర్లు అధికారంలోకి వచ్చాక మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాలన కేంద్రమైన సెక్రటేరియెట్​లోకి వెళ్లి వార్తలు సేకరించకుండా మీడియాపై ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక పాలసీలపై మీడియా సమావేశాల్లో జర్నలిస్టులు ప్రశ్నిస్తే వారిని బెదిరించడం సీఎం కేసీఆర్‌‌కు అలవాటుగా మారింది.