
ముషీరాబాద్, వెలుగు: ఆభరణాలు తయారుచేసి ఇస్తామని జ్యువెల్లరీ షాపు యజమానుల నుంచి తీసుకున్న బంగారాన్ని మరొకరికి విక్రయించి సొమ్ము చేసుకున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సోమవారం నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతీప్రసాద్, డీఐ రాములు వివరాలను వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన అబ్బాస్ అలీ షేక్(46), రజాక్ షేక్ (23), రమీజేక్(24) గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్నారు. వీరికి బంగారు ఆభరణాలు తయారు చేయడంలో మంచి పరిజ్ఞానం ఉంది.
అబ్బాస్ అలీషేక్ బంగారు షాపు యజమానుల నుంచి ముడి బంగారాన్ని సేకరించి ఆభరణాలు తయారు చేసి మళ్లీ దుకాణదారులకు అప్పగించేవాడు. శ్రీతుల్జాభవానీ జ్యువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 614.840 గ్రాముల 22 క్యారెట్ బంగారు ఆభరణాలు, శ్రీదుర్గా భవానీ బులియన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 1292.388 గ్రామల 22 క్యారెట్ల బంగారు కడ్డీని ఆభరణాల తయారీ కోసం సేకరించాడు. ఆభరణాలు తయారు చేసి దుకాణదారులకు ఇవ్వకుండా ఇతరులకు విక్రయించాడు.
ఈయనకు రజాక్షేక్, రమీజేక్సహకరించారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడమే కాకుండా రాళ్ల వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. సోమవారం వీరు ముగ్గురు టీసీఎస్ కాలనీలోని తమ ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. గోషామహల్, హుస్సేనియాలం, చార్మినార్ పోలీస్టేషన్ల పరిధిలోనూ ఇలాంటి మోసాలు చేసినట్లు గుర్తించారు. వీరి వద్ద రూ.90 లక్షలు, బంగారు ఆభరణాలు, రాళ్లను స్వాధీనం చేసుకున్నారు.