పోచారం కాల్పుల ఘటనలో ముగ్గురు అరెస్ట్..వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు

పోచారం కాల్పుల ఘటనలో ముగ్గురు అరెస్ట్..వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు

ఎల్బీనగర్, వెలుగు: ఆవుల తరలింపును అడ్డుకొని తనకు నష్టం కలిగిస్తున్నాడన్న కక్షతోనే పోచారంలో ప్రశాంత్​కుమార్​పై కాల్పులు జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు గురువారం ఎల్బీనగర్ లోని తన ఆఫీసులో వెల్లడించారు. 

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం పదేళ్లుగా ఏపీలోని హనుమాన్ జంక్షన్ నుంచి ఆవులను కొనుగోలు చేసి నగరంలోని కబేళాలకు తరలిస్తున్నాడు. కీసర మండలం రాంపల్లిలో నివాసముండే బిడ్ల ప్రశాంత్ కుమార్ అలియాస్ సోనూ సింగ్(28) గోరక్షక్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 

ఇటీవల ఇబ్రహీంకు చెందిన ఆవులను తరలిస్తుండగా ఘట్​కేసర్ మండలం యమ్నాంపేట్ చౌరస్తా దగ్గర ఔటర్ రింగ్ వద్ద పోలీసులకు పట్టించాడు. దీంతో సోనూసింగ్ పై ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడు. షాబాద్ కు చెందిన కురువ శ్రీనివాస్ మధ్యవర్తిత్వంతో మాట్లాడుకుందామని సోనూసింగ్​కు చెప్పాడు. యమ్నాంపేట్ సమీపంలోని టీ స్టాల్ వద్ద ఇబ్రహీం ఖురేషి, మహమ్మద్ హనీఫ్ ఖురేషి, కురువ శ్రీనివాస్, హస్సన్ బిన్ మోసిన్ వచ్చారు. సోనూసింగ్, ఇబ్రహీం ఖురేషి గంటసేపు మాట్లాడుకోగా వారి మధ్య మాటామాట పెరిగింది. ఇబ్రహీం ఇటీవల చత్తీస్ గఢ్​ నుంచి తెప్పించుకున్న రివాల్వర్ తో సోనూసింగ్ పై కాల్పులు జరిపాడు. 

ఛాతిపై కుడి, ఎడమ వైపు బుల్లెట్​ గాయాలయ్యాయి. వెంటనే ఇబ్రహీంతో పాటు వెంట వచ్చిన స్నేహితులు పరారయ్యారు. సోనూను స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనలో ఇబ్రహీం, కురువ శ్రీనివాస్, హస్సన్ బిన్ మోసిన్ ను అరెస్టు చేశామని, మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడని సీపీ తెలిపారు. ప్రణాళిక ప్రకారమే కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. 

నిందితుల వద్ద నుంచి దేశీయ పిస్టల్, కారు, మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మల్కాజిగిరి జోన్ డీసీపీ పద్మజ, ఏడీసీపీ వెంకట్రాయ రమణ, మల్కాజిగిరి ఏసీపీ ఎస్.చక్రపాణి పాల్గొన్నారు.