హైదరాబాద్ సిటీ, వెలుగు: డిజిటల్ అరెస్ట్ మోసాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఒకే కేసులో రూ.1.07 కోట్ల భారీ మోసానికి సంబంధించి ఢిల్లీకి చెందిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. సిటీ సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు ఈ కేసు వివరాలు వెల్లడించారు.
మనీ ఎక్స్చేంజ్ వ్యాపారి గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, ఆర్ఓ టెక్నీషియన్ హర్ ప్రీత్ సింగ్ అలియాస్ కరణ్ కౌశిక్, కుమార్ మోహిత్ అలియాస్ మోహిత్ కౌశిక్ కలిసి సైబర్ మోసాలు చేస్తున్నారు. 2025 అక్టోబర్ 16న హైదరాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వృద్ధుడికి ఫోన్ చేశారు. తాము ముంబై క్రైం బ్రాంచ్ అని చెప్పి మనీ లాండరింగ్‌లో ఇరుక్కున్నావంటూ బాధితుడిని భయపెట్టారు.
వీడియో కాల్ చేసి 'డిజిటల్ అరెస్ట్' చేశామని గంటల తరబడి మానసిక ఒత్తిడికి గురి చేశారు. చివరకు బాధితుడి నుంచి రూ.1.07 కోట్లు వివిధ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. తర్వాత తాను మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు సైబర్క్రైంపోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. వీరు గుజరాత్, కేరళ, మహారాష్ట్రల్లో కూడా పలు నేరాలు చేశారని పోలీసులు చెప్పారు.
