జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. ఆలయ కోనేరులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. ఆలయ కోనేరులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోని శివగంగా ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను మన్విత్ (10), మనస్విని (9) అనే అన్న చెల్లెలతో పాటు షర్వింద్ (7)గా గుర్తించారు. మరణించిన మన్విత్, మనస్విని భారతి-భూషణ్ దంపతుల పిల్లలు. మరో మృతుడు షర్వింద్ భారతి సోదరి కుమారుడు. 

భారతి-భూషణ్ దంపతులు జగిత్యాల పట్టణంలో నివాసముంటున్నారు. వేసవి సెలవులు కావడంతో భూషణ్ పిల్లలు వాళ్ల చిన్నమ్మ ఇంటికి వచ్చారు. బుధవారం (మే 20) మన్విత్, మనస్విని, షర్వింద్ ముగ్గురు కలిసి గ్రామ శివారులోని ఆలయ కోనేరులో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ముగ్గురు చనిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో కొండాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సరదగా ఇంట్లో ఆడుకున్న చిన్నారులు విగతజీవులుగా మారడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.