సాగునీటిపై కాంగ్రెస్,BRS రాజకీయం.. అవినీతిని ప్రశ్నించినందునే BRS నుంచి బయటకు పంపారు : కల్వకుంట్ల కవిత

సాగునీటిపై కాంగ్రెస్,BRS రాజకీయం.. అవినీతిని ప్రశ్నించినందునే BRS నుంచి బయటకు పంపారు : కల్వకుంట్ల కవిత
  •  బీసీ రిజర్వేషన్​ బిల్లుపై సీఎం రేవంత్​కు చిత్తశుద్ధి లేదు

కోరుట్ల, వెలుగు : సాగునీటి అంశంపై కాంగ్రెస్, బీఆర్​ఎస్​రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్​చేసి ఢిల్లీకి పంపారని, సోనియా, రాహుల్, ప్రియాంక ల బర్త్​డేలకు ఢిల్లీ వెళ్తున్న సీఎం.. బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మాత్రం మాట్లాడడం లేదన్నారు. 

కాళేశ్వరం కూలిపోయిందని.. పొలాలకు నీళ్లు ఇవ్వలేమని సీఎం అంటున్నారని, మేడిగడ్డతో సంబంధం లేకుండా రైతులకు సాగు నీరు ఇవ్వొచ్చన్నారు. కన్నెపల్లి పంప్​హౌజ్​నుంచి అన్నారం, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని, ఈ బ్యారేజీలు నింపితే భద్రాచలం కొట్టుకుపోతుందని సీఎం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే కొన్ని గుంటనక్కలు కలిసి తనను బీఆర్​ఎస్​నుంచి బయటకు పంపించాయన్నారు. 

మేధావులు, గొప్ప వ్యక్తుల ఆలోచనలతో టీఆర్​ఎస్​పుట్టిందని, ఆడ బిడ్డలంతా తెలంగాణ రక్షణ సేనకు అండగా ఉండాలని కోరారు. టీఆర్ఎస్​అధికారంలోకి వస్తే పిల్లల స్కూల్ ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, ఎంత పెద్ద హాస్పిటల్ కు వెళ్లినా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ నాయకులు అవినీతి మానేస్తే అన్ని పథకాలు ఉచితంగా ఇవ్వొచ్చన్నారు. ఎల్ నినో వస్తుందని ముందే తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటిని ఒడిసిపట్టే చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోదావరి పరిధిలోని రిజర్వాయర్లలో కేవలం 93 టీఎంసీల నిరు మాత్రమే నిల్వ ఉందన్నారు. 

తాగునీటికి కూడా ఇబ్బంది రానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్​రఘుతో పాటు పలువురు లీడర్లు, కార్యకర్తలు టీఆర్ ఎస్ లో చేరారు. అంతకు ముందు మెట్ పల్లి మండలం సత్తక్కపల్లి వద్ద తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. మెట్​పల్లి నుంచి కోరుట్ల వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు.