- ఉదయం 6.30 గంటలకే ఆయా ప్రాంతాల్లో పర్యటనలు
- సర్కిల్, జోనల్ అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎం రివ్యూ తర్వాత మూడు కార్పొరేషన్ల కమిషనర్లు ఫీల్డ్‌లోకి ఎంటర్అయ్యారు. మంగళవారం నిర్వహించిన రివ్యూలో శానిటేషన్ విషయంలో రాజీ పడొద్దని, రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించినా కఠిన చర్యలుంటాయని, ప్రతీ రోజు ఫీల్డ్ లో తిరిగి పర్యవేక్షించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ముగ్గురు కమిషనర్లు వారి పరిధుల్లోని ప్రాంతాల్లో పర్యటించారు.
హైదరాబాద్కమిషనర్ఆర్వీ కర్ణన్.. అడిషనల్ కమిషనర్ రవికిరణ్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మక్కా మజీద్, మదీనా, చార్మినార్ ప్రాంతాల్లో తనిఖీ చేశారు. రోడ్ల క్లీనింగ్, మార్కెట్ ప్రాంతాల్లో చెత్త సేకరణ, చౌరస్తాలు, ఫుట్‌పాత్‌లు క్లీన్‌గా ఉన్నాయా లేవా అనేది పరిశీలించారు.
రంజాన్ నెల ప్రారంభమవుతుండటంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, కుత్బుల్లాపూర్ జోన్ జీడిమెట్ల సర్కిల్ పరిధిలో హెచ్‌ఎంటీ రోడ్ నుంచి అయోధ్య నగర్ ఎక్స్ రోడ్ వరకు పారిశుధ్య పనులను సైబరాబాద్ కమిషనర్ సృజన పరిశీలించారు. 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ అమలు చేయాలని ఆదేశించారు.
మల్కాజిగిరి, ఎల్బీనగర్ లోని పలుచోట్ల మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించి శానిటేషన్, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఉప్పల్‌లోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, హలీం నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, భద్రత, పర్యవేక్షణ, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై సూచనలు చేశారు.
