జూలూరుపాడు/మల్లా పూర్/రేగోడ్, వెలుగు: అప్పుల బాధతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పంతులుతండా గ్రామానికి చెందిన అంగోత్ భీముడు(46) తనకున్న 3 ఎకరాల పొలంలో పత్తి పండించారు. అకాల వర్షాలతో పంట సరిగా పండక రూ. 3 లక్షల వరకు అప్పయ్యింది. అప్పు ఎలా తీర్చాలోననే ఆందోళనతో శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంపల్లి గ్రామానికి చెందిన గుగ్లవత్ శ్రీను(28) మూడేళ్ల క్రితం ఉపాధి కోసం అప్పు చేసి దుబాయ్ వెళ్లారు. పరిస్థితులు అనుకూలించక తిరిగి గ్రామానికి వచ్చేశారు. ఇక్కడ రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంటలు దెబ్బతినడంతో అప్పులు ఎలా తీర్చాలోననే ఆందోళనతో పురుగుల మందు తాగి మృతిచెందారు. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రానికి చెందిన గొండ్ల యాదయ్య (35) వ్యవసాయం చేస్తూ, చుట్టుపక్కల గ్రామాల్లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
