- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్
హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణ సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వివరణ ఇచ్చారు. బ్రాహ్మణులు తనకు శత్రువులు కాదని, వారిపై తనకు ఎలాంటి పగ లేదని తెలిపారు. తాను అన్ని జాతులు, మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆదివారం గాంధీ భవన్‌లో మందుల సామేల్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను బ్రాహ్మణ సోదరులను ఉద్దేశించి ఆ మాటలు అనలేదు. అవి అనుకోకుండా అన్న మాటలు మాత్రమే. నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. వాటితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు" అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఒక లౌకికవాద పార్టీ అని ఆయన కొనియాడారు. బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తీరుపై సామేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘తుంగతుర్తికి వచ్చి నన్ను ఓడిస్తానంటున్న బండి సంజయ్‌కు అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మాదిగలు అంటే బండి సంజయ్‌కి అంత చిన్నచూపా?’’ అని ప్రశ్నించారు. బ్రాహ్మణులను కించపరిచాననే నెపంతో తనపై కేసు పెడతానంటున్న బండి సంజయ్‌పై తాను ‘అట్రాసిటీ’ కేసు పెడతానని సామేల్ హెచ్చరించారు. బ్రాహ్మణులపై అంత ప్రేముంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని సవాల్ విసిరారు.
