జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోన కొడిమ్యాల, భీమారం మండల్లాలో సంచరిస్తూ ప్రజలన భయభ్రాంతులకు గురిచేస్తోంది. పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పులిసంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బుధవారం ( ఫిబ్రవరి 25)కొడిమ్యాలమండలం దమ్మయ్యపేట సమీపంలో గరటవాగు సమీపంలో పెద్దపులి సంచరిస్తున్న ట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో దమ్మయ్యపేట శివారులోని అడవుల్లో పరిశీలించిన అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో దమ్మయ్యపేట, సమీప గ్రామాలపై సూరంపేట, తిరుమలాపూర్, సంద్రాలపల్లిగ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బావులు, పొలాల దగ్గర వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు భీమారం మండలం మోత్కూర్ రావుపేట గ్రామ శివారులో గత రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. పొలాలకు వెళ్లే రైతులకు ఈ క్రూరమృగం ప్రత్యక్షంగా కనిపించడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
