కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కథలాపూర్ మండలం కలికోట గ్రామంలోని సూరమ్మ ప్రాజెక్టు, పోతారం గ్రామం లొంకరామన్న ఆలయం పరిసరాల్లో ఈ నెల 2న పులి సంచరించినట్లు పాదముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల అటవీ ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లా భీంగల్ శివార్ల వైపు పులి కదిలినట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్‌పల్లి రేంజ్ సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 2న కలికోట, పోతారం గ్రామాల పరిసరాలు, రాళ్లవాగు ప్రాంతాల్లో, 4న మెట్‌పల్లి మండలం రంగారావుపేట, పాటిమీదితండా పరిసరాల్లో పులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అటవీశాఖ హెచ్చరించింది. గాలింపు చర్యల్లో ఎఫ్‌ఆర్‌వో పద్మారావు, డిప్యూటీ రేంజ్ అధికారులు అరుణ్‌కుమార్, సురేశ్‌కుమార్, బీట్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది ఉన్నారు.
కమ్మర్‌పల్లిలో మరో పులి..
బాల్కొండ: మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి కమ్మర్‌పల్లి రేంజ్‌లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఈ నెల 3న జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు కనిపించడంతో అప్రమత్తమయ్యారు.
ఆడపులి కోసం వచ్చిన ఈ పులి గట్టు పొడిచిన వాగు బ్యాక్‌వాటర్ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బీట్ ఆఫీసర్ శ్రీదేవి పులి జాడలను గుర్తించారు.
