- తిమ్మాపూర్లో చిరుత దాడి.. మూడు లేగదూడలు మృతి
- అచ్చంపేటలో ఎద్దును గాయపరిచిన పెద్దపులి
ఇల్లంతకుంట/అచ్చంపేట, వెలుగు: పులల సంచారం కొన్ని గ్రామాల్లో రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. అడవుల నుంచి దారి తప్పి గ్రామాల్లోకి వస్తున్న పులులు పశువులపై పంజా విసురుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో మంగళవారం చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన వోరేం సుధాకర్, గుర్రాల మల్లయ్యలకు చెందిన మూడు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుత పాదముద్రలను పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలంల అల్లిపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు పుణె నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో పాటు అటవీ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు గ్రామస్తులకు సూచించారు.
ఎద్దుపై పెద్ద పులి దాడి..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్ పల్లి గ్రామ శివారులో కాడెద్దుపై పెద్దపులి ఎటాక్ చేసింది. గ్రామానికి చెందిన సభావత్ హట్టికి చెందిన కాడెద్దును వ్యవసాయ పొలంలోని పాకలో కట్టేశారు. సోమవారం అర్ధరాత్రి పెద్దపులి ఎద్దుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మంగళవారం సంఘటన స్థలాన్ని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలకిష్టయ్య, బీట్ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి పరిశీలించారు. గాయపడిన ఎద్దుకు వెటర్నరీ అధికారులు ట్రీట్మెంట్ చేశారు.
