వరల్డ్ కప్‌ గెలిచాకే నాకు నిద్ర పడుతది: తిలక్ వర్మ

వరల్డ్ కప్‌ గెలిచాకే  నాకు నిద్ర పడుతది: తిలక్ వర్మ
  • ఆసియా కప్ విజయమే పాక్‌‌‌‌‌‌‌‌కు అసలైన సమాధానం
  • దేశం కోసం ప్రాణం పెట్టి ఆడా
  • టీమిండియా స్టార్ తిలక్ వర్మ


హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు అతి చేశారని, ఫైనల్లోనూ రెచ్చగొట్టే చేష్టలు చేసినా కప్పు నెగ్గి వారికి  అసలైన సమాధానం చెప్పామని టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాదీ తిలక్ వర్మ అంటున్నాడు. టీ20ల్లో తాను రెండు సెంచరీలు చేసినప్పటికీ, ఫైనల్లో పాక్‌‌పై తీవ్ర ఒత్తిడిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని స్పష్టం చేశాడు. తన తుదిపరి టార్గెట్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ అన్న వర్మ.. ఆ కప్పు నెగ్గిన తర్వాతనే తనకు నిద్రపడుతుందని చెప్పాడు. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ గెలిచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తిరిగొచ్చిన తిలక్‌‌‌‌‌‌‌‌ తాను చిన్నప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటున్న లింగంపల్లిలోని లీగలా క్రికెట్ అకాడమీని మంగళవారం సందర్శించాడు. తన కోచ్‌‌‌‌‌‌‌‌ సలామ్ బయాష్‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ అనుభవాలను వివరించాడు. ఆ వివరాలు తిలక్ మాటల్లోనే..

సెంచరీల కన్నా గొప్ప ఇన్నింగ్స్ ఇది

నా రెండు టీ20 సెంచరీల కన్నా ఈ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కే నేను ఎక్కువ విలువ ఇస్తాను. ఎందుకంటే ఇది ఆసియా కప్ ఫైనల్, అదీ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆడుతున్నాం. అంచనాలు, ఒత్తిడి ఊహకందని స్థాయిలో ఉన్నాయి. అలాంటి సమయంలో దేశం కోసం నిలబడి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే నా లక్ష్యం. అది నెరవేరినందుకు గర్వంగా ఉంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత నన్ను విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు. విరాట్ భాయ్ ఒక లెజెండ్. తనతో పోల్చడం నాకెంతో గర్వకారణం. కానీ నా దృష్టి అంతా దేశం కోసం మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు గెలవడంపైనే ఉంటుంది.

గ్రౌండ్‌‌లో చాలానే జరిగాయి..

ఫైనల్లో మేం తొలి మూడు వికెట్లు త్వరగా కోల్పోయినప్పుడు పాక్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లు మరింత దూకుడుగా ప్రవర్తించారు. మాటలతో రెచ్చగొట్టి, మా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారు. గ్రౌండ్‌‌లో చాలానే జరిగాయి. అవన్నీ కెమెరా ముందు చెప్పలేను.  కానీ, ఆ సమయంలో నేను ఒక్క తప్పుడు షాట్ ఆడినా నా దేశాన్ని ఓడించిన వాడిని అవుతానని తెలుసు. అందుకే, వారికి మాటలతో కాకుండా, మ్యాచ్ గెలిచి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా బ్యాటే మాట్లాడింది, అంతిమంగా మేమే గెలిచాం. ఫైనల్లో మాపై ఒత్తిడి కచ్చితంగా ఉంది. ఆ సమయంలో  దేశం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమనే భావనతో ఆడాను. అన్నింటికన్నా దేశమే గొప్ప అని నేను భావిస్తా. అందుకే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బేసిక్స్‌‌‌‌‌‌‌‌కు కట్టుబడి, ప్రశాంతంగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేశాను.  క్లిష్టమైన పిచ్‌‌‌‌‌‌‌‌పై  సంజూ శాంసన్, శివం దూబే ఇచ్చిన  మంచి పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌ వ్లలే ఈ విజయం సాధ్యమైంది. 

వాళ్లను ఎన్నడూ మరవను

నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నా కోచ్‌‌‌‌‌‌‌‌లే.  సచిన్, కోహ్లీ తమ గురువులకు ఎంతో గౌరవం ఇస్తారు. నేను కూడా నా మూలాలను, నా గురువులను ఎన్నటికీ మర్చిపోను. ఈ రోజు అందరూ నన్ను తిలక్ వర్మగా గుర్తుపడుతున్నారు. కానీ, ఎవరూ లేనప్పుడు నా వెనుక నా కోచ్‌‌‌‌‌‌‌‌లు సలామ్ బయాష్ సర్, పృథ్వీ అన్న ఉన్నారు. నా పేరెంట్స్ తర్వాత వారే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్లే నా సర్వస్వం.  నా ఈ విజయాలన్నీ వారికే అంకితం.

తదుపరి టార్గెట్‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్

ఆసియా కప్ విజయం గొప్పదే అయినా  నా అంతిమ లక్ష్యం వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్ నెగ్గడమే. 2011 వరల్డ్ కప్ చూసే నేను క్రికెట్‌‌‌‌‌‌‌‌ను ఇష్టపడటం ప్రారంభించాను. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఆ టోర్నీలో ఆడే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌లో భాగమై, కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాలన్నదే ఇప్పుడు నా టార్గెట్‌.  వరల్డ్‌ కప్ గెలిచిన రోజే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.