పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. మట్టి లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ.. ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తాకడంతో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ పరిధిలోని ఒక ఇటుక బట్టీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటుకల తయారీ కోసం మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ.. అక్కడ పైనుంచి వెళ్తున్న 11 కేవీ (11 KV) విద్యుత్ లైన్‌ను బలంగా తాకింది. దాంతో క్షణాల్లోనే లారీలో భారీగా మంటలు చెలరేగాయి.
అయితే లారీ క్యాబిన్‌కు మంటలు అంటుకోవడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమయ్యారు. మంటలు మరింత తీవ్రరూపం దాల్చక ముందే వారు లారీలోంచి కిందకు దూకేశారు. దాంతో వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
►ALSO READ | తెలంగాణ పలు జిల్లాల్లో అకాల వర్షాలు.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన జొన్నలు
కానీ, ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. డ్రైవర్ విద్యుత్ వైర్లను గమనించకుండా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
