ఎయిమ్స్ మోడల్లో టిమ్స్ : వైద్య ఆరోగ్య శాఖ

ఎయిమ్స్ మోడల్లో టిమ్స్ : వైద్య ఆరోగ్య శాఖ
  • టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో ఢిల్లీ ఎయిమ్స్ తరహా వైద్య సేవలకు ప్రభుత్వం కసరత్తు
  •     ఎయిమ్స్ లో స్టడీ కోసం త్వరలో ఢిల్లీకి మెడికల్​ ఆఫీసర్ల టీమ్​
  •     క్రౌడ్ మేనేజ్​మెంట్, పేషెంట్ కేర్, ఎమర్జెన్సీ సేవలపై ఫోకస్
  •     ఇప్పటికే సిటీలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో శానిటేషన్​పై స్టడీ 
  •     త్వరలోనే అందుబాటులోకి రానున్న సనత్ నగర్ టిమ్స్

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్ నలువైపులా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీమ్స్) హాస్పిటల్స్ నిర్వహణపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎల్బీనగర్, సనత్‌‌‌‌నగర్, అల్వాల్​లో నిర్మిస్తున్న టిమ్స్ తోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ హాస్పిటల్స్ లో కార్పొరేట్ స్థాయి వసతులు, ఎయిమ్స్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా హాస్పిటల్స్ మేనేజ్​మెంట్ పై స్టడీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల టీమ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనుంది. 

దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ హాస్పిటల్ అయిన ఢిల్లీ ఎయిమ్స్ ను సందర్శించి.. అక్కడి పేషెంట్ కేర్, క్రౌడ్ మేజేజ్​మెంట్, ఎమర్జెన్సీ వైద్య సేవలను అధికారులు పరిశీలించనున్నారు. కాగా, ఇప్పటికే టిమ్స్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సనత్ నగర్ టిమ్స్ ను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు పనులను స్పీడప్ చేశారు.  

క్రౌడ్​ను మేనేజ్ చేస్తూ.. మెరుగైన వైద్య సేవలు 

ఢిల్లీ ఎయిమ్స్ లో సుమారు 2,400 బెడ్స్​ ఉన్నాయి. 42 స్పెషాలిటీ సేవలు అందుతున్నాయి. రోజుకు సుమారు 15 వేల ఓపీలు నమోదవుతున్నది. ఇంత రద్దీ ఉన్నప్పటికీ.. ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. టిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ కాబట్టి ఇక్కడ పేషంట్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేలాదిగా వచ్చే జనాన్ని కంట్రోల్ చేస్తూనే.. క్వాలిటీ వైద్యం ఎలా అందించాలి?  క్యూ లైన్ల పద్ధతి, సెక్యూరిటీ గార్డుల మోహరింపు ఎలా ఉంది? ఓపీ మేనేజ్​మెంట్ అవుట్ పేషెంట్ విభాగానికి వచ్చే వారికి టోకెన్ సిస్టమ్, వెయిటింగ్ హాల్స్, డాక్టర్ల వద్దకు పంపించే విధానం ఎలా ఉందో పరిశీలించనున్నారు. 

వార్డుల్లో చేరిన పేషెంట్లకు నర్సింగ్ సేవలు, డాక్టర్ల రౌండ్స్, అటెండర్లను కంట్రల్ చేసే విధానాన్ని పరిశీలించనున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చే ఎమర్జెన్సీ కేసులను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? గోల్డెన్ అవర్ లో ట్రీట్​మెంట్ ప్రొసీజర్స్ ఏంటి? అనే అంశాలను పరిశీలించనున్నారు. స్టడీ ఆధారంగా మన టిమ్స్ లో వాటి ఇంప్లిమెంటేషన్ దిశగా చర్యలు తీసుకోనున్నారు.  

ఇప్పటికే సిటీలో కార్పొరేట్ స్టడీ పూర్తి 

నాలుగు టిమ్స్​ హాస్పిటల్స్ లో శానిటేషన్ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ తో వెళ్తున్నది. ఇప్పటికే హైదరాబాద్ లోని యశోద, అపోలో, ఏఐజీ వంటి వాటివి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సందర్శించారు. అక్కడ ప్రధానంగా శానిటేషన్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ వ్యవస్థలను స్టడీ చేశారు. 

ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నరు?  వాళ్ల జీతాలు? షిఫ్టులు వివరాలు తెలుసుకున్నారు. ఆ స్టడీ పూర్తికావడంతో.. ఇప్పుడు అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణను చూసేందుకు అధికారుల టీమ్ ఢిల్లీకి వెళ్తున్నరు. 

ఎయిమ్స్ సందర్శన ముగిశాక.. కార్పొరేట్ హాస్పిటల్స్ లో శానిటేషన్ మోడల్, ఎయిమ్స్ పేషెంట్ కేర్ మోడల్ రెండింటినీ కలిపి ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనున్నారు. దీని ఆధారంగానే రాబోయే టిమ్స్ హాస్పిటల్స్ లో స్టాఫ్ రిక్రూట్‌‌‌‌మెంట్, మేనేజ్​మెంట్ విధివిధానాలు ఖరారు కానున్నాయి.